బిల్లుపై చర్చిస్తే విభజనకు అంగీకరించినట్లే
Published Sun, Jan 12 2014 2:07 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
నరసన్నపేట, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు అంగీకరించడమంటే విభజనకు సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్లేనని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనని చెప్పారు. శనివారం ఆయన నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని కోరుతు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటానికి టీడీపీ నేతలు విమర్శించడాన్ని తప్పుపట్టారు. పార్టీ పరంగా తెలంగాణాలో నష్టం జరుగుతుందని తెలిసినా సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా పోరాడుతున్నారన్నారు.
స్వార్థం కోసమే టీడీపీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు అంగీకరిస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క ఎన్నికలోనూ గెలువలేని టీడీపీ భవిష్యత్‌లో పార్టీని రక్షించుకోవడం కోసమే పొత్తుల కోసం ప్రయత్నిస్తోందన్నారు. సమైక్యం కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదని కృష్ణదాస్ అన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఏవిధంగా బుద్ధి చెప్పనున్నారో తెలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, పార్టీ నాయకులు ఆరంగి మురళీధర్, పాగోటి అప్పారావు, ఎం.శ్యామలరావు, కె.సీతారాం, రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement