నరసన్నపేట : వరుణుడి కరుణ కోసం సత్యవరాగ్రహారంలో గురువారం 21 మంది రుత్వికులు వరుణయాగం ఘనంగా నిర్వహించారు. స్థానిక కామేశ్వరి స్వామి ఆలయంలో ఉదయం వరుణయాగాన్ని బుచ్చిరామయ్య వజ్ఞులు ప్రారంభించారు. ముత్తైవులు బిందెలతో నీళ్లు తీసుకుని వచ్చి ఇందులో పాల్గొన్నారు. 1001 బిందెల పవిత్ర జలాలతో ఈ యాగం నిర్వహించారు. కామేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా సత్యవరాగ్రహారం వేద మంత్రాలతో మార్మోగింది. వరుణయాగం ప్రభావం కచ్చితంగా ఉంటుందని వనమాలి బుచ్చిరామయ్య వజ్ఞులు అన్నారు. ఇప్పటికీ 11 యాగాలు నిర్వహించామని అన్నీంటా శుభ ఫలితాలే వచ్చాయనిచెప్పారు.
జిల్లాలో మరిన్ని యాగాలు: కలెక్టర్
జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రధానంగా రైతులకు ఖరీఫ్‌లో దేవుడు సహకరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆకాంక్షించారు. సత్యవరం మాదిరిగా ఆరు చోట్ల యాగాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లాలో పరిస్థితి అంతా ఇబ్బందిగా ఉండేదని, కరువు ఛాయలు కన్పించాయని చెప్పారు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉన్నా రెండు రోజులుగా అల్పపీడనం కారణంగా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురవడం ఆశాజనకంగా ఉందన్నారు. అయినా జిల్లాలో వరుణయాగాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నరసన్నపేట సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, జడ్‌పీటీసీ చింతు శకుంతల, ఎంపీటీసీ ఆరంగి కృష్ణవేణి, చైతన్య భారతి అధ్యక్షుడు చింతు పాపారావు, గ్రామ పెద్ద యగళ్ల చిన్న నర్సునాయుడు తదితరులు పాల్గొన్నారు.
కరుణించవా.. వరుణ దేవా!
Published Fri, Aug 14 2015 1:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement