తొలకరి ఆనందం
► సుంకేసులలో ఒక టీఎంసీ,
► జీడీపీలో 2 టీఎంసీల నీరు చేరిక
► వరద నీటి సద్వినియోగానికి ముందస్తు ప్రణాళికలు
► నేటి నుంచి కేసీకి నీటి విడుదల
కర్నూలు సిటీ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన తొలకరి చినుకులకే జలశయాలు, చెరువులకు జల కళ వచ్చింది. వారం రోజుల క్రితం నీరు లేక వెలవెలబోయిన మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న నీటి తరహా ప్రాజెక్టుల్లో కొంత నీరు వచ్చి చేరింది. ఇందులో భాగంగా హంద్రీ నది పైనున్న గాజులదిన్నె ప్రాజెక్టు, తుంగభద్ర నది పైనున్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజీ(సుంకేసుల)లకు ఇటీవల కురిసిన వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. సుంకేసులకు సుమారు టీఎంసీ, గాజులదిన్నెకు 2 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
సుంకేసుల నుంచి వర్షపు నీటిని వృథాగా దిగువకు వదలకుండా జల వనరుల శాఖ అధికారులు తుంగభద్ర జలాలను కర్నూలు-కడప కాలువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌లు కేసీకి నీరు విడుదల చేయనున్నారు. యేటా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నెల రోజులకు కానీ జలాశయాలకు కొత్త నీరు వచ్చేది కాదు.
అయితే ఈ ఏడాది సీజన్ మొదలయిన మొదటి రోజే జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతుండటం విశేషం. ఇక ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఆర్డీఎస్ ఆనకట్టు పొంగి పొర్లుతోంది. అదేవిధంగా జిల్లాలోని చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని 157 చెరువుల్లో ఇప్పటికే 20కి పైగా జల కళ సంతరించుకున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని సుమారు 30 చెరువుల్లోనూ నీరు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.