స్వాతి కేసు ఏమైంది?
ఏళ్లు గడుస్తున్నా వీడని
చిన్నారి హత్య కేసు మిస్టరీ
కుమార్తెను గుర్తు చేసుకొని రోదిస్తున్న కన్నవారు
నరసన్నపేట : అది ఆగస్టు 20.. 2011వ సంవత్సరం.. ఎప్పటిలాగానే చిట్టి స్వాతి పాఠశాలకు వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి చేరలేదు. గుర్తు తెలియని దుండగుడు ఆ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. హత్యోదంతం తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గుర్తించేలోపే పాఠశాల ఆవరణలోనే ప్రాణాలను విడిచింది. ఈ దారుణం తెలుసుకొని నరసన్నపేటతోపాటు జిల్లా మొత్తం నిర్గాంతపోయింది. అయ్యో ఎంత పని చేశాడు.. అభం సుభం తెలియని బాలికను పొట్టన పెట్టుకున్నాడే అని ప్రజలు కంట తడి పెట్టారు. తన కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్లిందని స్వాతిని అల్లారు ముద్దుగా చూసుకొనే తల్లిదండ్రులు రోదించారు. అప్పట్లో ఈ హత్య కేసు సంచలనమైంది. అప్పటికి స్వాతి నరసన్నపేటలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతూ అక్కడికి సమీపంలోని భవానీపురంలో కుటుంబ సభ్యులతో ఉండేది. బాలిక తల్లి పాఠశాల సమీపంలోనే కూరగాయల షాపులో పని చేస్తుండేది.
సంఘటన ఎలా జరిగిందంటే..
మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే చేసిన స్వాతి మరో రెండు గంటల్లో ఇంటికి వెల్తుందనగా ఈ దారుణ సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయం అవుతుంది. తోటి పిల్లలతో ఆటాడుకుంటుండగా గోడ దూకి వచ్చిన ఒక అగంతుకుడు (ఉన్మాది) అమాంతంగా స్వాతిని ఒడిసి పట్టుకొని గొంతుపై కత్తితో కోసి అంతే వేగంగా గోడ దూకి పరారయ్యాడు. రక్తం మడుగులో ఉన్న స్వాతి అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది.
చురుగ్గా దర్యాప్తు
వెంటనే తేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికి సీఐగా మూర్తి, ఎస్‌ఐగా తిరుపతిరావులు ఉండేవారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తిరుపతిరావు ఇచ్చిన ఫఇర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద క్రైమ్ నంబరు 108-11గా కేసు నమోదు చేశారు. సంఘటనపై పూర్తిగా పరిశీలించడంతోపాటు.. అన్ని కోణా ల్లో దర్యాప్తు చేశారు. చివరికి ఒక ఉన్మాది ఈ హత్యకు పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు. అంతే ఆ తరువాత ఇప్పటి వరకూ దీనిపై కనీస పురోగతి లేదు. స్వాతి తల్లిదండ్రులు ఇప్పటికీ కుమార్తెను తలుచుకొని రోదిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక ఉన్మాది చేతిలో హత్యకు గురైన సంఘటనను ఇప్పటికీ నరసన్నపేట పట్టణ వాసులు మరిచిపోలేక పోతున్నారు. కొలిక్కి రాని కేసుస్వాతి హత్య కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేసినప్పటికీ ఆచూకీ లభించలేదు. సుమారు ఏడాది పాటు దర్యాపు చేసిన పోలీసులు ఆ తరువాత నిలిపి వేశారు.
బాధగా ఉంది
అల్లారు ముద్దుగా పెంచుకున్న స్వాతిని మరచిపోలేకపోతున్నాం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తలచుకొని బాధపడుతున్నాను. పోలీసులు కూడా ఏమీ తేల్చలేక పోయారు. బాధిగా ఉంది. నాకుమార్తె బతికిఉంటే ఎంతో సందడిగా ఉండేది.
- లక్ష్మి, స్వాతి తల్లి