చిట్టి గుండె కూడా లయ తప్పుతోంది.. గట్టిపడేలోపే గండాల్లో చిక్కుకుంటోంది!గట్టెక్కించి ఆ బుజ్జి గుండెకు నూరేళ్ల భరోసానిస్తోందిశ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్!ఎక్కడో కాదు.. తెలంగాణ, సిద్దిపేటలో!ఇక్కడ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మందులు సహా చికిత్స అంతా ఉచితమే! చిన్నారితో పాటు తల్లితండ్రులకూ ఉచిత భోజన, వసతి సౌకర్యాలున్నాయి.
∙గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట
ఏటా ప్రపంచవ్యాప్తంగా 13. 5 లక్షల మంది పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నట్లు అంచనా. ఇందులో మన దేశంలోనే 2.4 లక్షల మంది ఉండగా.. వాళ్లలో 60వేల మందికి హార్ట్ సర్జరీ అనివార్యమవుతోంది. కానీ 10వేల మంది చిన్నారులకు మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొందరు పిల్లలు అనారోగ్య సమస్యలతోనే జీవనపోరాటం చేయాల్సి వస్తోంది. ఇలాంటి చిన్ని హృదయాలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2012లో శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్‌ని ప్రారంభించింది.
అందులో భాగంగా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), పల్వాల్ (హరియాణ), ముంబై (మహారాష్ట్ర), ముద్దహళ్లి(కర్ణాటక)లో చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసింది. ఆ వరుసలోనిదే సిద్దిపేటలోని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కూడా! ఇవికాకుండా మరో అయిదు ప్రాంతాల్లో మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లనూ ఏర్పాటుచేసి వైద్యసేవలతో పేదలకు అండగా నిలుస్తోందీ ట్రస్ట్. ఐదు చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లలో ఇప్పటి వరకు 5,86,366 మంది చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. అందులో 33,772 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న పిల్లలకూ అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.
సిద్దిపేటలో..
శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్.. ఐదెకరాల విస్తీర్ణంలోని వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం సేవలను అందిస్తోంది. మాజీ క్రికెటర్, శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు సునీల్ గావస్కర్ కూడా ఈ సెంటర్‌ను సందర్శించారు.
ఫొటోలుః కె సతీష్
ఓన్లీ దిల్ .. నో బిల్
శ్రీ సత్యసాయి సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుంది. బిల్ ఉండదు. ఇక్కడ ట్రీట్‌మెంట్ పొందిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక భరోసా కనిపిస్తోంది.
∙సునీల్ గావస్కర్, ఇండియన్ మాజీ క్రికెటర్, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు
న్యాయం చేస్తున్నాం..
మేము చదివిన చదువుకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండువేలకు పైగా హార్ట్ సర్జరీలు చేశాం. హార్ట్‌కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను వెంటనే డాక్టర్స్‌కి చూపించాలి.
∙డాక్టర్ అమితా శర్మ, అనఘా తులసి, భూషణ్
ఫ్రీగా చేస్తారని తెలిసి..
మా పాపకు తరచు అనారోగ్యం చేస్తుండటంతో హాస్పిటల్‌లో చూపిస్తే గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. సర్జరీ చేయాలన్నారు. సత్యసాయి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్‌లో ఫ్రీగా చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. పాపకు సర్జరీ అయింది.
∙శాలిని యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్
బరువు పెరగట్లేదని..
మా బాబు బరువు పెరగట్లేదని డాక్టర్‌కి చూపిస్తే హార్ట్‌లో హోల్ ఉందని తేల్చారు. తెలిసినవాళ్ల ద్వారా సత్యసాయి హాస్పిటల్‌కి వచ్చాం. పైసా తీసుకోకుండా బాబుకు సర్జరీ చేశారు.
∙బోలేశ్వర్, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
సేవే లక్ష్యంగా..
శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రులన్నిట్లో అడ్వాన్స్‌డ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. సేవే లక్ష్యంగా కొనసాగుతున్నాం.
∙సి. శ్రీనివాస్, చైర్మన్, శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్
Comments
Please login to add a commentAdd a comment