ఇసుక కరువాయె !
నరసన్నపేట రూరల్ : ఇసుక దొరక్క భవన, గృహ నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న ఇసుక ర్యాంపుల విషయంలో అధికారులు అవలంబిస్తున్న విధానాల కారణంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. వారి తీరు కారణంగానే ర్యాంపుల సంఖ్య రోజురోజుకీ తగ్గుపోతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా కొత్త ర్యాంపుల మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంటుంది. మొత్తం ఇసుక ర్యాంపుల వ్యవహారం గందరగోళంగా మారింది. డబ్బు పెట్టి కొందామన్నా ఇసుక లభించడంలేదని గృహ నిర్మాణదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇసుక పాలసీని నిర్ణయించడంతోపాటు గ్రామాల్లో స్వయంశక్తి సంఘాల మహిళలకు ర్యాంపుల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. దీంతో సక్రమంగా ఇసుక లభిస్తుందని అంతా ఆశించారు.
అయితే కొద్ది రోజుల్లోనే గృహ నిర్మాణదారుల ఆశలు అడుగంటాయి. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటారుు. ప్రస్తుతం నరసన్నపేట ప్రాంతంలో ట్రాక్టర్ లోడు ఇసుక రూ. 4,500 లనుంచి రూ. 5000 పలుకుతోంది. 10 రోజుల క్రితం 3,500 రూపాయలకు లభించే ఇసుక ధర అమాంతం పెరగడానికి డీఆర్‌డీఏ అధికారుల తీరే కారణమని పలువురు మండిపడుతున్నారు. కొత్త ర్యాంపుల మంజూరులో తీవ్రజాప్యాన్ని భవన నిర్మాణదారులు తప్పుపడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది తాపీ మేస్త్రీలు, ఇతర భవన నిర్మాణ కార్మికులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక పాలసీ వచ్చిన తరువాత కూడా ఏమిటీ బాధలని వాపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న ర్యాంపులు ఎనిమిదే..
జిల్లాలో వంశధార, నాగావళితో పాటు పలు నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నప్పటికీ కేవలం పది ర్యాంపులనే అధికారులు మంజూరు చేశారు. తాజాగా పురుషోత్తపురంలో ర్యాంపు మంజూరైంది. అయితే జలుమూరు మండలం దొంపాక ర్యాంపు 15 రోజుల క్రితం నిలిచిపోరుుంది. అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు ర్యాంపు, శ్రీకాకుళం మండలం కల్లేపల్లి ర్యాంపులు కూడా ఆగిపోయూరుు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కల్లేపల్లి ర్యాంపులో ఇసుక తవ్వేందుకు బిల్లులు రావడంలేదు. ఫలితంగా ఇసుక ధరకు రెక్కలొచ్చారుు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ర్యాంపులు కూడా జాతీయ రహదారికి ఆనుకొని లేకపోవడంతో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సరుబుజ్జిలి మండలం యరగాం, పురుషోత్తపురం, పెద్ద సవలాపురం, బూర్జ మండలం అల్లెన, కకండ్యాంల్లోనూ, సంతకవిటి మండలం తమరాం, వీరఘట్టం మండలం తలవరం, కొత్తూరు మండలం ఆకులతంపరల్లో ర్యాంపులు కొనసాగుతున్నాయి. అయితే నరసన్నపేట, జలుమూరు, గార, శ్రీకాకుళం మండలాల్లో అధికారులు ఇసుక ర్యాంపుల కోసం పరిశీలన చేసినప్పటికీ మంజూరు మాత్రం చేయలేదు. దీంతో నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి, పోలాకి, సారవకోట, జలుమూరు, సంతబొమ్మాళి తదితర మండలాల్లో ఇసుక లభ్యం కాని పరిస్థితి నెలకొంది.
అందని రవాణా చార్జీలు !
ఇసుక విక్రయంలో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న శ్రీకాకుళం జిల్లాలో సక్రమమైన విధానం ఇప్పటికీ అమలు కావడంలేదు. రోజుకో నిబంధనను అధికారులు విధిస్తున్నారు. కొత్త పాలసీ ప్రారంభంలో ఇసుక ధరను అధికారులు నిర్ణయించారు. దీంతో ఇసుకను కొనుగోలు చేసుకొని ట్రాక్టర్ యజమానులు గృహనిర్మాణదారులకు విక్రయించే వారు. ఈ పద్ధతి కొన్ని రోజులు కొనసాగింది. తరువాత ట్రాన్స్‌ఫోర్టు చార్జీలు కలుపుకొని ట్రాక్టరు యజమానులు మీ సేవా కేంద్రాల్లో డీడీలు తీసుకొని వెళ్లేవారు. ఇసుక ధరల మినహా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రవాణా చార్జీలను ట్రాక్టరు యజమానులకు తిరిగి చెల్లిస్తామని డీఆర్‌డీఏ అధికారులు చెప్పారు. దీంతో ట్రాక్టరు సిబ్బంది రవాణా చార్జీలతో కలిపి డీడీలు ర్యాంపుల వద్ద అందజేసేవారు. ఈ విధానం 10 రోజులు కొనసాగింది. అయితే ట్రాక్టరు సిబ్బందికి ఇప్పటికీ రవాణా చార్జీలు తిరిగి రాలేదు. ఒక్కో ట్రాక్టరుకు కనీసం రూ. 20 వేలు చొప్పున్న రావాల్సి ఉంది. తాజాగా ఈ నిబంధనలను సైతం మార్పు చేసి పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. ఒక్క ఇసుక ధరనే చెల్లిస్తున్నారు. దీంతో అటు గృహనిర్మాణ దారులు, ఇటు ట్రాక్టరు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
‘డబ్బు వెంటనే చెల్లించాలి’
ట్రాక్టర్ యజమానులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు వెంటనే చెల్లించాలని పోతయ్యవలసకు చెందిన ఆదినారాయణ, లుకలాం గ్రామానికి చెందిన వెంకటరమణలు డిమాండ్ చేశారు. 10 రోజల పాటు రవాణా చార్జీలు కూడా చెల్లించి ఇసుకను వినియోదారులకు సరఫరా చేశామన్నారు. రవాణా చార్జీల డబ్బు ట్రాక్టర్ యజమానుల బ్యాంకు ఖాతాలో వెంట వెంటనే పడతాయని డీఆర్‌డీఏ అధికారులు చెప్పినప్పటికీ ఆ పరిస్థితి లేదన్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు కనీసం రూ. 20 వేల వరకూ రావాల్సి ఉందన్నారు. సంక్రాంతికి ముందు డబ్బులను బ్యాంకులో వేయూలని కోరారు.