పేరు ‘పెద్ద’..!
Published Thu, Mar 13 2014 3:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: మునుపెన్నడూ లేని దుర్భర పరిస్థితిని జాతీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర విభజన సెగ కాంగ్రెస్, బీజేపీలకు తాకింది. దీంతో రెండింటికీ..అభ్యర్థులు కరువవుతున్నారు. బీజేపీ పరిస్థితి గతానికి భిన్నంగా ఏమీ లేకపోగా..మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అతి దారుణంగా తయారైంది. మున్సిపల్ ఎన్నికల్లో వల వేసినా.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. పరువు నిలుపుకునేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా.. వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకూ అభ్యర్థుల కొరత ఏర్పడింది. దీంతో చాలా చోట్ల బల మైన అభ్యర్థులు పోటీలో ఉండకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నరసన్నపేట మండలంలో ఒక్క చెన్నాపురం మినహ మరెక్కడా ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు లేరు. జలుమూరు, సారవకోట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు.. వారి గుర్తులను మున్సిపల్ ఎన్నికలకు కేటాయించింది. స్వతంత్రులకు కోసం 82 గుర్తులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌కు హస్తం, బీజేపీకి కమలం, సీపీఐకి కంకి, సీపీఎంకు సుత్తి,కత్తి నక్షత్రం, బీఎస్పీకి ఏనుగు గుర్తులను కేటాయించగా..వైఎస్సార్ సీపీకి ఫ్యాన్ గుర్తును కేటాయించింది. అలాగే..టీడీపీతో ఇతర పార్టీలకు ఆయా గుర్తులను నిర్ధారించింది.
గడ్డు పరిస్థితి..
విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను ఆపార్టీ సీనియర్ నాయకులు వీడటంతో..గతంలో ఎప్పుడూ లేని దుస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఏళ్లు గడుస్తున్నా.. బీజేపీ మాత్రం బలం పుంజుకోవడం లేదు. దీంతో రెండు జాతీయ పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఐదు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని జాతీయ పార్టీలకు అంత సీన్ లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో అధిక శాతం ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ప్రాంతీయ పార్టీల గుర్తులే ఉండనున్నాయి.
Advertisement
Advertisement