సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ సాధన ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో శరవేగంగా దూసుకుపోవాల్సిన కారు జోరు తగ్గింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ సీపీలు కౌన్సిలర్ అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉండగా, టీఆర్‌ఎస్ మాత్రం వెనుకబడింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ నేతలంతా తలో జాబితా తయారు చేయడంతో మున్సిపల్ ఇన్‌చార్జ్‌లు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లకు ఇంకా రెండురోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో ఆశావహులంతా ఆందోళన చెందుతున్నారు. టికెట్లు ఎప్పుడు కేటాయిస్తారు..నామినేషన్లు ఎప్పుడు వేయాలంటూ.. నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ శ్రేణుల్లో టెన్షన్
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే టీఆర్‌ఎస్ ఎక్కడా కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. మెదక్, సదాశివపేట, గజ్వేల్‌లో నామమాత్రంగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీ లు, జోగిపేట నగర పంచాయతీలో ఇప్పటి వరకు ఇప్పటి వరకూ అభ్యర్థులను ఖరారు చేయలేకపోయింది. దీంతో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే పక్కపార్టీల వైపు తొంగిచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డిలోని 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
హరీష్ ఇన్‌చార్జిగా ఉన్నా...అదే సీన్
టీఆర్‌ఎస్ ముఖ్యనేత, ఎమ్మెల్యే హరీష్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గజ్వేల్ నగర పంచాయతీలో సైతం కేవలం ఐదు వార్డులకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు మున్సిపాలిటీల్లో 105 వార్డులు ఉండగా కేవలం 31 వార్డులకు మాత్రమే అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు నగర పంచాయతీల్లో 40 వార్డులకుగాను ఇప్పటి వరకు కేవలం గజ్వేల్ నగర పంచాయతీలో ఐదు మంది అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్ ప్రకటించింది. టికెట్ల కోసం పోటీ పెరగటానికి తోడు మున్సిపల్, నియోజకవర్గ, జిల్లా ఇన్‌చార్జిల పేరిట ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం, పార్టీలో గ్రూపు విభేదాల కారణంగా టికెట్ల కేటాయింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మల్లగుల్లాలు
Published Wed, Mar 12 2014 11:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement