(ఫైల్ ఫొటో)
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు.
మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment