మృతిచెందిన పూజిత (ఫైల్)
మియాపూర్: ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. ఈ సంఘటన మదీనాగూడ అర్చనా ఆస్పత్రి ముందు మంగళవారం జరిగింది. వివరాలు.. పటాన్‌చెరులోని కర్దనూర్ గ్రామానికి చెందిన పాండు, కవతి దంపతుల కూతురు పూజిత(18) మదీనాగూడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు డిసెంబర్ 26న కడుపునొప్పి రావడంతో పటాన్‌చెరులోని సాయిగణేష్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు అర్చన ఆస్పత్రికి తీసుకెళ్ళాలని సూచించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రికి అపెండిక్స్ ఆపరేషన్‌ను డాక్టర్లు పూర్తి చేశారు. రెండు రోజుల తర్వాత డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళవచ్చని సూచించారు. అంతలోనే అపెండిక్స్ గడ్డ పగిలిందని ఇన్ఫెక్షన్ అధికంగా అయిందని సూచించారని కుటుంబసభ్యులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు.
సోమవారం రాత్రి మళ్ళీ ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం వరకు బాగానే ఉన్నా 11 గంటల ప్రాంతంలో మృతి చెందింది. బీపీ నియంత్రలో లేనప్పుడు ఆపరేషన్ చేయడంతోనే మా అమ్మాయి పూజిత మరణించిందని వారు ఆరోపించారు. అనంతరం వారు ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. మియాపూర్ పోలీసులు ఆందోళనను విరమింపచేశారు. అపెండిక్స్ గడ్డ పగలడంతో పేగులకు ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆమె చనిపోయిందని, ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడా లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment