హన్మకొండ చౌరస్తా: కరోనా వైరస్ సోకిందనే అనుమానం ఓ గర్భిణి ప్రాణాలను బలిగొంది. మృత శిశువుతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు అత్యవసర వైద్యం అందించాల్సిన వైద్యులు.. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం కోసం ఎదురుచూశారు. దీంతో 12 గంటల వేదన అనంతరం ఆమె తుదిశ్వాస విడిచింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన హరిప్రియ ఎనిమిది నెలల గర్భవతి. రెండు రోజుల క్రితం నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్త నాగరాజు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. గర్భంలో శిశువు మృతి చెందిందని గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)కి వెళ్లాలని సూచించారు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో హుటాహుటిన జీఎంహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే హరిప్రియ తీవ్ర ఆయాసంతో బాధ పడుతుండగా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో సిబ్బంది ముట్టుకోవడానికి కూడా సాహసించలేదని భర్త నాగరాజు రోదిస్తూ తెలిపాడు. వైరస్ నిర్ధారణ కోసం నమూనాలు తీసుకుని పంపించారని, రాత్రంతా చికిత్స చేయకపోవడంతో హరిప్రియ తీవ్ర ఆయాసంతో నరకయాతన అనుభవించిందని పేర్కొన్నాడు. తీరా.. శుక్రవారం ఉదయం 9 గంటలకు వైద్య సిబ్బంది ‘చావు’కబురు చెప్పారని నాగరాజు రోదిస్తూ చెప్పాడు. వైద్యులు సకాలంలో చికిత్స చేసి ఉంటే తన భార్య బతికేదని పేర్కొన్నాడు. వైరస్ అనుమానం ఉంటే చికిత్స చేయరా? అని నిలదీశాడు.
చికిత్స చేశాం: హరిప్రియను ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే గర్భంలోని శిశువు మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమా సరళాదేవి అన్నారు. అప్పటికే హరిప్రియ బీపీ, ఆయాసంతో బాధపడుతోందని, చికిత్స అందిస్తున్న క్రమంలో పల్మనరీ ఎంబాలిజం సమస్య ఎదురైందన్నారు. గర్భంలో మృత శిశువు, బీపీ ఎక్కువగా ఉన్న వారికి ఈ సమస్య వస్తుందన్నారు. తద్వారా రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తుల్లోకి చేరడం కారణంగా ఆమె చనిపోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment