కాజీపేటకు చెందిన ఓ ఉద్యోగికి రెండు రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతూ పరీక్ష చేయించుకున్నాడు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు కూడా చేయించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. అందరికీ స్వల్ప లక్షణాలే. కిట్లు తీసుకుని ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు.
ఖిలా వరంగల్‌కు చెందిన కూరగాయల వ్యాపారికి వారం రోజులక్రితం పాజిటివ్ వచ్చింది. జ్వరం, జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మూడు రోజుల్లో జ్వరం తగ్గింది. జలుబు ఐదు రోజులు ఉంది. 7వ రోజు పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది.
సాక్షి, కాజీపేట: కరోనా మూడో దశలో కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్‌ను జయిస్తున్నారు. దీనిపై పూర్తి అవగాహన పెరగడం.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతూ సురక్షితంగా బయటపడుతున్నారు. వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం నింపుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చినా.. ఇతర సభ్యులందరికీ వచ్చినప్పటికీ ఆందోళన చెందడం లేదు. ఇరుగుపొరుగు వారు కూడా సహకరిస్తుండడంతో ఆస్పత్రుల్లో చేరి లక్షల రూపాయలు పెట్టడం లేదు. ఇలా నగరంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20,650 మందికిపైగా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. వారి ఇళ్లకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు రోజూ వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
ఇంటింటి జ్వర సర్వే...
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు మూడు రోజులుగా సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి ప్రత్యేక జ్వరం సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణ జరిగినట్లయితే వెంటనే మందుల కిట్‌లను అందజేస్తున్నారు. అర్బన్, గ్రామీణ హెల్త్ సెంటర్లపై ఒత్తిడి లేకుండా జ్వరం సర్వే ఉపయోగపడుతోంది. హనుమకొండ జిల్లాలో 22,375 గృహాలను సందర్శించి అందులో 3,356 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి 3,356 మందికి హోం ఐసోలేషన్ కిట్స్ ఇచ్చారు. వరంగల్ ట్రై సిటీలో దాదాపు 7వేలమంది వరకు హోం ఐసోలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
వైద్యాధికారుల సూచనలు...
► ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్న కరోనా రోగులు వైద్యాధికారులకు ఫోన్ చేసి వారి సూచనలు, సలహాలు పొందుతున్నారు.
► జ్వరం ఎక్కువగా ఉంది..ఇంట్లోనే ఉండొచ్చా.. ఆస్పత్రికి వెళ్లాలా .. ఏ మందులు వాడాలి. ఇలా అర్ధరాత్రి సైతం జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర వైద్యులకు ఫోన్‌లు చేస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
► ఒకప్పుడు కరోనా సోకితే వారితో మాట్లాడేందుకు కూడా భయపడేవారు. ఇప్పుడు మాస్క్‌లు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబంతోనే కలిసి ఉంటున్నారు.
► ప్రత్యేక గదిలో ఉంటూ ఇంటి భోజనం తింటున్నారు. ఇలా చేయడం వలన వారిలో ఒత్తిడి తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment