నామ'మాత్ర'మే..! | government hospital details | Sakshi
Sakshi News home page

నామ'మాత్ర'మే..!

Published Tue, Nov 29 2016 11:23 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నామ'మాత్ర'మే..! - Sakshi

నామ'మాత్ర'మే..!

– పేదల వైద్యానికి అనారోగ్యం
– జిల్లా వ్యాప్తంగా ప్రబలుతున్న రోగాలు
– పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో మందుల కొరత
– సర్వజనాస్పత్రిలోనూ అదే పరిస్థితి
– ప్రైవేట్‌ బాట పడుతున్న రోగులు

 
అనంతపురం మెడికల్‌ : పేదల వైద్యానికి అనారోగ్యం చేసింది. రోగాల బారిన పడి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న వారికి నామ'మాత్ర'పు సేవలు అందుతున్నాయి. వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మందుల కొరత పట్టిపీడిస్తుండగా.. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి, అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నాయి. కొన్ని రోజులుగా ఏ పల్లెలో చూసినా రోగాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలతో గ్రామీణులే కాకుండా పట్టణవాసులు కూడా తల్లడిల్లుతున్నారు.

ప్రైవేటుకు పరుగులు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఘోరంగా ఉంటోంది. సర్వరోగ నివారిణి తరహాలో ఏ జబ్బు వచ్చినా వ్యాధి లక్షణంతో పనిలేకుండా అందుబాటులో ఉన్న మందులనే ఇచ్చి పంపించేస్తున్నారు. దీంతో బాధితులకు రోగం నయం కాక ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు. మరికొందరు వ్యయ ప్రయాసలకొచ్చి అనంతపురం సర్వజనాస్పత్రికి వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ ఔట్‌పేషెంట్స్‌ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

డాక్టర్‌ రాసిచ్చిన మందుల చీటి తీసుకుని ఫార్మాసిస్ట్‌ వద్దకు వెళితే అందులో సగం మందులే ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. వాస్తవానికి 20 రకాల యాంటి బయాటిక్స్, 220 రకాల మందులు, సిరప్స్, సూదులు, సెలైన్‌ బాటిల్స్, సర్జికల్‌ మందుల కోసం ప్రతి ఆస్పత్రికి పడకల సామర్థ్యాన్ని బట్టి మందులను కేటాయిస్తున్నారు. ఒక్కో పీహెచ్‌సీకి రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు, సీహెచ్‌సీకి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, ఏరియా ఆస్పత్రులకు రూ. 8 లక్షల వరకు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రూ.11 లక్షలు, అనంతపురం సర్వజన ఆస్పత్రికి రూ. 1.30 కోట్ల వరకు ప్రతి త్రై మాసికానికి ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.  

వేధిస్తున్న మందుల కొరత :
జేఎన్‌టీయూ సమీపంలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు మందులు వస్తే ముందుగా వాటిని అనాలసిస్‌ కోసం హైదరాబాద్‌కు పంపుతారు. అక్కడ ఒకే అయితేనే పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండడంతో రోగులు ప్రైవేట్‌ బాట పట్టాల్సి వస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల కోసం ఆస్ప్రిన్, దగ్గుకు ఆంబ్రాక్సిల్, గాయాలకు పూసే బెంజాయిక్‌ ఆసిడ్‌..సాలిసిలిక్‌ ఆసిడ్, ఆయాసం నుంచి ఉపశమనం కోసం వాడే బుడెసునైడ్‌ నెబులైజింగ్‌ సొల్యూషన్‌.. సాల్బుటమాల్,  కన్ను, చెవిలో వేసే సిఫ్రోప్లాక్సిసిన్‌ డ్రాప్స్, రక్తస్రావం కాకుండా ఉండేందుకు ఉపయోగించే ఫ్యాక్టర్‌–8, ఫ్యాక్టర్‌–9, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి వాడే పర్‌మిత్రిన్‌ సరిపడినంతగా లేవు. వీటితో పాటు యాంటీబయాటిక్స్‌ మందులకు కరువు వచ్చింది.

అత్యవసర కేసులొస్తే అంతే..
పాయిజన్‌ కేసులు వస్తే వైద్యులు చేతులెత్తేసే పరిస్థితి వస్తోంది. బాధితులకు వాడే పీఏఎం (పామ్‌), అక్ట్రోపిన్‌ సల్ఫేట్‌ సరఫరా కావడం లేదు. ఇక శస్త్ర చికిత్సల సమయంలో అనస్తీషియా కీలకం. నొప్పి తెలియకుండా ఉండేందుకు పలు రకాల ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి కొరత కూడా ఉంది. డోబుటమైన్, కెటామిన్, లిగ్నోకైన్‌ అండ్‌ అడ్రినలిన్, మజిల్‌ రిలాక్సేషన్‌ కోసం వాడే సక్సినిల్‌ కోలిన్‌ సరఫరా లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.  

బయట కొనుక్కోమన్నారు
నాది లేపాక్షి మండలం తిమ్మగానపల్లి. శుక్రవారం రాత్రి నా భార్య డెలివరీ అయింది. పాపకు చికిత్స చేస్తున్నారు. ఏవో మందులు రాసిచ్చారు. మందులిచ్చే చోటుకు పోతే ఆ మందులు లేవన్నారు. డాక్టర్‌కు చెబితే బయట కొనుక్కునిరావాలని చీటి ఇచ్చారు.
– లక్ష్మీపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement