– ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో ఔషధాలు
– నిబంధనలు ఉల్లంఘించి నిల్వలు
– ప్రాణం మీదకు తెచ్చేలా వైద్యం చేస్తున్న పరిస్థితి
– పట్టించుకోని ఆరోగ్య, ఔషధ నియంత్రణ శాఖలు
– అడపాదడపా దాడులతో సరిపెడుతున్న వైనం
అనంతపురం మెడికల్: ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామన్న ధ్యాస తప్పిస్తే వృత్తికి న్యాయం చేయాలన్న ఊసే లేదు. కళ్లముందే అమాయక ప్రజల ప్రాణాలు ‘అనంత’ వాయువుల్లో కలిసి పోతున్నా వాళ్లకు పట్టదు. వైద్య ఆరోగ్యశాఖ, ఔషధ నియంత్రణ శాఖల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో మెడి‘కిల్లింగ్’ జరుగుతోంది. రిజిస్ట్రర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్‌ఎంపీ), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ), మెడికల్ దుకాణాల నిర్వాహకులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు అడపాదడపా దాడులు చేసి చేతులు ముడుచుకోవడం మినహా చిత్తశుద్ధితో చేస్తోందేమీ లేదన్నది స్పష్టమవుతోంది. గోరంట్లలో ఓ ఆర్‌ఎంపీ నిర్వాకం కారణంగా అభంశుభం తెలియని చిన్నారి మృత్యువాత పడితే రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున మందులు లభ్యం కావడం ఔషధ నియంత్రణ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది.
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా ప్రథమ చికిత్స కేంద్రాలు, 1600కు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. అయితే ఇక్కడ నిబంధనలను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన చోట ‘అంతకుమించి’ వైద్యం అందిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ఇక మెడికల్ షాపుల్లో అర్హత లేని వారు ఫార్మసిస్టులుగా కొనసాగుతూ ఇష్టారాజ్యంగా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. అర్హత లేని నకిలీ, ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు, మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత కలెక్టర్ కోన శశిధర్ ఉన్నప్పుడు ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో క్లినిక్‌ల ముందు ప్రథమ చికిత్స కేంద్రాలని బోర్డులు వెలిశాయే కానీ వైద్యంలో మాత్రం మార్పు రాలేదని ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
- మూడు నెలల క్రితం కనగాపల్లికి చెందిన గాయత్రి (11) ట్యూషన్‌కు వెళ్లొచ్చి తలనొప్పిగా ఉందనడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన మాత్రలిచ్చి పంపిస్తే మరుసటి రోజు బాలిక ఆరోగ్యం క్షీణించింది. మళ్లీ అతడి వద్దకే తీసుకెళ్లగా విష పురుగు కుట్టిందని చేతులెత్తేశాడు. తీరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
- రెండు నెలల క్రితం అనంతపురంలోని పాతూరుకు చెందిన ప్రభాకర్ కడుపు నొప్పి, వాంతులు అధికమై మార్కెట్ సమీపంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. స్కానింగ్ చేయించుకుని రావాలని తన క్లినిక్‌లోనే ఉన్న స్కానింగ్ సెంటర్ స్లిప్పుల్లో రాసిచ్చాడు. పరీక్ష ఫలితం అపెండిసైటిస్. ఆపరేషన్ చేయాలని, ప్రైవేట్‌కు వెళ్తారా అని అడిగితే తమకంత స్థోమత లేదని, ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చారు. ఎంఎస్ వార్డుల్లో అడ్మిషన్ చేయించుకుని చికిత్స చేస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండా మూడ్రోజుల్లో డిశ్చార్జ్ అయ్యాడు.
మెడి‘కిల్లింగ్’!
Published Tue, Jul 25 2017 10:40 PM | Last Updated on Thu, Aug 30 2018 6:04 PM
Advertisement
Advertisement