ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం
► విద్యార్థులకు కడుపునిండా తిండి
► ఆక్రమాలకు అడ్డుకట్ట
► సంచులపై టీఎస్‌ఎస్‌సీఎల్ ముద్ర
ఆదిలాబాద్ టౌన్ : పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి, దీంతో అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు సరిగా తినలేక పోయేవారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది.
సన్నబియ్యం రాక అక్రమార్కులకు వరంగా మారింది. ఇటు చౌక దుకాణాలు, అటు పాఠశాలలు, వసతి గృహలకు ఒకే రకమైన సంచుల్లో సన్న, దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇన్నాళ్లు అక్రమార్కులకు కాసులు కురిపించారుు. ఈ క్రమంలో అవి పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. అక్రమాలను నిరోదించడానికి పాలిథీన్ సంచుల్లో బడి బియ్యం సరఫరా చేస్తున్నారు.
నియోజక వర్గంలో..
ఆదిలాబాద్ నియోజక వర్గంలోని ఆదిలాబాద్ మండలంలో101 ప్రాథమిక పాఠశాలలు, 18 యూపీఎస్, 21 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. జైనథ్ మండలంలో 39 పీఎస్‌లు, 9 యూపీఎస్‌లు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. బేల మండలంలో 34 పీఎస్‌లు, 11 యూపీఎస్, 5 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. వీటితో పాటు నియోజక వర్గంలోని ఆశ్రమ, సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యాన్ని వడ్డిస్తున్నారు. మొత్తం నియోజక వర్గంలో 20 వేల వరకు విద్యార్థులు ఉన్నారు.
పక్కదారి పట్టించకుండా...
ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఇప్పటిదాకా పాఠశాలలు, వసతి గృహలు, రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం అన్ని సంచులు ఒకే విధంగా ఉండేవి. 50 కిలోల గోనే సంచుల్లో అందజేసేవారు. దీంతో ఏవి దొడ్డు రకం..ఏవి సన్న రకమో.. సంచి తెరచి పరిశీలిస్తే కానీ తెలిసేది కాదు. దీన్ని ఆసరాగా చేసుకోని అక్రమార్కులు పక్కదారి పట్టించేవారన్న ఆరోపణలు ఉన్నారుు. అలాగే సంచుల్లో బియ్యం తూకం తక్కువగా ఉంటున్నాయన్న ఫిర్యాదులు వచ్చేవి. ఈ నేపథ్యంలో గత నెల నుంచి 50 కిలోల ప్రత్యేక సంచి (తెలుపురంగు)లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. సంచులపై టీఎస్‌ఎస్‌సీఎల్ (తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ)ముద్రతో పాటు వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం బియ్యం, ప్యాకింగ్ చేసిన తేదిని ముద్రించారు.
ఆక్రమాలను అరికట్టేందుకే
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఇది వరకు గోనే సంచుల్లో చౌకదరల దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో ఇవి కూడా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన పాలిధీన్ సంచుల్లో 50 కిలో సంచుల్లో సరఫరా చేస్తున్నాం. దీంతో దొడ్డు బియ్యం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండదు.
-శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి