సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల్లో అవకతవకలను సరిదిద్ది, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్‌సీపీ వినతిపత్రాలు సమర్పించింది. వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆ జిల్లా కలెక్టర్ గిరిషాను కలిసి ఈమేరకు వినతిపత్రాలు సమర్పించారు.
తెలుగుదేశం పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. టీడీపీ యాప్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుతూ యాప్ జనరేట్ అయ్యే ఓటీపీని సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్లను కోరారు.
టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం : గడికోట
ఓట్ల పరిశీలన ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజల వ్యక్తిగత స్వేఛ్చను హరించేలా సేకరణ చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యాప్‌లో సమాచారం పొందుపరిచే మిషతో టెలిఫోన్ నంబర్ తీసుకుని ఓటీపీ కూడా అడుగుతున్నారని తెలిపారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.
కలెక్టర్ దృష్టికి రాజంపేట ఉదంతం
రాజంపేట నియోజకవర్గంలో ఇలా సమాచారం ఇవ్వని ఓ ఇంట్లోని వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతాన్ని కలెక్టర్ దృష్టికి శ్రీకాంత్‌రెడ్డి తీసుకువెళ్లారు. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల కింద సమాచారం అడిగారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తోందంటూ ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి కోరారు.
2019కి ముందు నుంచే బోగస్ ఓట్లు : పేర్ని నాని
2019కి ముందు నుంచే ఒకే డోర్ నెంబర్ లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని పేర్ని నాని సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అలా గే కొందరు ఏపిలో, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. మరి కొందరికి మున్సిపల్ ఏరియాలో, గ్రామంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ చిరునామాల్లో ఉంటున్న వారిని అడగ్గా వారికీ విషయం తెలియదని చెబుతున్నారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు చేర్చారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి అవకతవకలు, బోగ స్ ఓట్లపై ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి ఫిర్యా దు చేశామని తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచార ణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో జిల్లా కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment