సన్న బియ్యం ధరలు పైపైకి..!
రబీ నిల్వలు దాస్తున్న వ్యాపారులు
మిల్లుల్లో అక్రమ నిల్వలు
ధాన్యాన్ని దాచేస్తున్నారు
కృత్రిమ కొరతతో ధరలు అధికం
కైకలూరు: జిల్లాలో సన్న బియ్యం దందా నడుస్తోంది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా ఖరీప్ సాగు మందగించింది. ధాన్యం కొరత ఏర్పడింది. ఇదే అదనుగా బియ్యం వ్యాపారులు ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. జిల్లాలో ప్రసుత్తం సుమారు 75వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అంచనా. ఖరీఫ్‌సాగు దిగుబడులపై ఇప్పటికే రైతులు ఆశలు వదులుకున్నారు. రబీలో నిల్వలను వ్యాపారులు దాచేస్తున్నారు. పాత నిల్వలు బహిరంగ మార్కెట్‌లోకి రాకపోవడంతో కొనుగోలుదారులపై భారం పడుతోంది. సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సన్నబియ్యం క్వింటా ధర రూ.2700 నుంచి రూ.3000కి చేరింది. వ్యాపారులు 25 కేజీల బస్తాను రూ.850 నుంచి రూ.1000కి విక్రయిస్తున్నారు. సన్నం బియ్యం కేజీ ధర రెండు వారాల ముందు రూ.32కు విక్రయించగా ప్రస్తుతం రూ.37 వరకు పెరిగింది. ఇటీవల క్వింటాకు రూ.200 అదనంగా బియ్యం ధర పెరిగింది. సన్నబియ్యంలో రకాలను బట్టి అదనంగా రేట్లు పెరుగుతున్నాయి. కర్నూలు సోనమసూరికి చెందిన లలిత బ్రాండ్ 25 కేజీల బియ్యం బస్తా రూ.1200కి విక్రయిస్తున్నారు. జిల్లాలో వ్యాపారులు, దళారులు ఖరీఫ్‌లో పంట దిగుబడులు రావని ముందుగానే ఓ అంచనాకు వచ్చి సన్న బియ్యం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
మిల్లర్ల మాయాజాలం...
మిల్లర్ల వద్ద సన్న రకం బియ్యం నిల్వలు భారీగా ఉన్నాయి. సాధారణంగా సన్నరకం బియ్యానికి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అధిక ధర పలుకుతోంది. ఇది ముందే ఊహించిన మిల్లర్లు, వ్యాపారులు జిల్లాలో బియ్యం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. గతంలో ధాన్యం నిల్వలకు లిమిటేషన్ విధించారు. విధిగా లెసైన్సులు పొందాల్సి ఉండేది. నేడు ఆ పద్ధతిని తీసివేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించి విక్రయించుకునే అవకాశం కల్పించారు. పూర్వం మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగినప్పుడు అధికారులు దాడులు నిర్వహించేవారు. ప్రభుత్వపరంగా సన్న బియ్యం దుకాణాలను తెరిచేవారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులు దారికి వచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవేమీ జరగడం లేదు. మిల్లర్లు, వ్యాపారులు గొలుసుకట్టు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొనుగోలుదారులు రేట్లు ఎందుకు పెంచారని అడిగితే మిల్లర్లు ధరలు పెంచారు, మమ్ముల్ని ఏం చేయమంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంగా..
బియ్యం డిమాండ్‌ను అసరాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా వ్యాపారులు మార్పు చేస్తున్నారు. కంటికి ఆకర్షించే రంగురంగుల బ్యాగులతో కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఇటీవల జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో సన్న బియ్యంగా మార్పు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైలు ప్రయాణికుల బోగిలలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం తరలిపోతోంది. అధికారుల అక్రమ నిల్వలపై దాడులు చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.