సన్నబియ్యమేవీ..? | where is narrow rice for anganwadi | Sakshi
Sakshi News home page

సన్నబియ్యమేవీ..?

Published Tue, Apr 4 2017 10:40 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

where is narrow rice for anganwadi

► ఏప్రిల్‌ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం
► ఇప్పటి వరకూ సరఫరా చేయనివైనం
► ఎస్‌ఎంఎస్‌లకే పరిమితమవుతున్న గుడ్లు
► సిబ్బందికి వంటగ్యాస్‌ భారం
► గర్భిణులు, చిన్నారులకందని పౌష్టికాహారం
మాతాశిశువులకు పౌష్టికాహారం అందించాలి్సన అంగన్‌వాడీ కేంద్రాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందడం లేదు. పొగలేని పొయ్యిలు ఇచ్చారు కానీ గ్యాస్‌ ధర మాత్రం మొక్కుబడిగా చెల్లిస్తున్నారు.  గుడ్ల సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం సరఫరా చేసే పరిస్థితి కనిపించడంలేదు.

అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు
ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు                 : 7
అంగన్‌వాడీ కేంద్రాలు               : 1,605
మినీ అంగన్‌వాడీ∙కేంద్రాలు       : 291
లబ్ధిపొందే చిన్నారుల సంఖ్య    : 70,121
గర్భిణులు, బాలింతల సంఖ్య    : 20,248
గుడ్లు (నెలకు)                        : 15,572,931

నేలకొండపల్లి: ఏప్రిల్‌ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యం వండిపెడతామని ప్రభుత్వం ప్రకటించింది.  కానీ ఇప్పటివరకు కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేయలేదు. జిల్లాలోని 7 ప్రాజెక్ట్‌ల పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకా దొడ్డు బియ్యం ఉన్నాయి. సన్నబియ్యంపై అధికారులకు ఆదేశాలు కూడా అందలేదు. ఈ క్రమంలో సన్నబియ్యం వండిపెట్టడం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. దొడ్డు బియ్యం నిల్వలను వెనక్కి పంపిస్తారా..? అవే కొనసాగిస్తారా..? అనే అంశం ఎటూ తేలడంలేదు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు రానురాను దయనీయంగా మారుతున్నాయి.

గతంలో ఇచ్చిన పౌష్టికాహారం కూడా అందించలేకపోతున్నాయి. గర్భిణులకు, బాలింతలకు, చి న్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలు పలు చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర, కల్లూరు, కారేపల్లి, ఖమ్మం అర్భన్, ఖమ్మం రూరల్‌  ప్రాజెక్ట్‌ల పరిధిలో 70,121 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 20,248 మంది అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించుకుంటున్నారు. ఇటీవల గుడ్ల కాం ట్రాక్టర్‌ మార్పు వల్ల పలు ప్రాజెక్ట్‌లలో ఫిబ్రవరి నెలలో చాలాచోట్ల గుడ్లుఅందలేదు. కొన్ని చోట్ల నెలలో ఒక్కసారి మాత్రమే గుడ్లను సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. అంగన్‌వాడీ కేం ద్రాల్లో మెనూఅమలుపై ఉన్నతాధికారులు పర్య వేక్షించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

గ్యాస్‌ భారం..
ఐసీడీఎస్‌ కేంద్రాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి గ్యాస్‌కు ధర చెల్లిస్తారు. దీంతో పిల్లలు తక్కువగా ఉన్న చోట గ్యాస్‌ భారం అధికంగా పడుతోంది. ఉదాహరణకు.. నేలకొండపల్లి మండలంలోని ఆచార్లగూడెం కేంద్రంలో లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్‌కు మూడు నెలలకు ఒకసారి సుమారు రూ. 330 నుంచి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. కానీ వంటకు మూడు నెలలకు ఒక సిలిండర్‌ అవసరమవుతోంది. దీంతో రూ.870 పెట్టి గ్యాస్‌ కొనుగోలు చేయాల్సివస్తోంది. వచ్చే అరకొర వేతనాలతో అదనపు భారాన్ని ఎలా భరించాలని ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.

‘సన్న బియ్యం’ ఆదేశాలు రాలేదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్న బియ్యాన్ని ఏప్రిల్‌ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  కానీ మాకు ఇంకా అధికారికంగా ఆదేశాలు రాలేదు. జిల్లాలో పలు చోట్ల గుడ్లు నెలలో ఒక్కసారే అందించారు. అందుకే కాంట్రాక్టర్‌కు 15 రోజులకే  బిల్లులు ఇచ్చాం. గ్యాస్‌ భారం పడుతోందని ఆయాలు చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌కు తెలిపాం. ఒంటిపూట బడులు మా పరిధిలో లేదు. టీచర్ల విన్నపం మేరకు రాష్ట్ర డైరెక్టర్‌కు తెలిపాం. కేంద్రాలలో మెనూ కచ్చితంగా అమలు చేయాలి. లేకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి.  –ఆర్‌.రాజ్యలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement