నో మెనూ.. పెట్టిందితిను
విద్యార్థులకు అందని పోషకాహారం
దోమలతో సహవాసం
ఇతర వ్యాపకాల్లో వార్డెన్లు బిజీ
సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల మోత
మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 119 వసతి గృహాలు ఉండగా వాటిలో 9,876 మంది, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 96 వసతి గృహాలు ఉండగా వాటిలో 6705 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1288 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా వసతి గృహాల్లోని విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన వార్డెన్లు నెలవారీ మామూళ్ల పేరుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే అంశంపైనే అధికంగా దృష్టిసారించి పిల్లలను అర్ధాకలితో ఉంచుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వారంలో ఐదు రోజుల పాటు వసతి గృహాల్లో గుడ్డు వడ్డించాలి. మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే పాఠశాలలో ఇస్తున్నారు కదా అని ఎదురుప్రశ్నిస్తున్నారు. తలకు రాసుకునే కొబ్బరినూనె ఖర్చులు కూడా రెండు నెలలుగా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది.
పిల్లల సంరక్షణ బాధ్యతలను చూడాల్సిన వార్డెన్లు ఇతర పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో పిల్లలకు ఏం పెడుతున్నారో, వారేం తింటున్నారో, ఏం చదువుతున్నారో పట్టించుకునే వారే కరువయ్యారు. వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రైవేటు చెప్పే ట్యూటర్లకు గత ఎనిమిది నెలలుగా గౌరవవేతనం ఇవ్వని పరిస్థితి. ఇలా ఎన్నో సమస్యలను సాక్షి బృందం గుర్తించింది.
పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదు. తోట్లవల్లూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో పిల్లలే లేరు. పామర్రు బీసీ బాలికల వసతి గృహంలో 25 మంది పిల్లలున్నట్లు లెక్కల్లో ఉన్నా అక్కడ ఐదుగురే ఉన్నారు. పామర్రు ఎస్సీ బాలికల వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్ లేరు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు వసతి గృహం వార్డెన్ ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. బాలికల వసతి గృహంలో వరండాలోనే బాలికలు నిద్రిస్తున్నారు. ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టుకున్నా దోమలబెడద వీరిని వెంటాడుతోంది.
మైలవరం బీసీ బాలుర వసతి గృహంలో 150 మంది పిల్లలకుగాను ఐదు మరుగుదొడ్లే ఉన్నాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో పోషకాహారంతో కూడిన భోజనం పెట్ట డం లేదు. జి.కొండూరు మండలం వెలగలేరులోని హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది.
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు వసతి గృహం ప్రైవేటు భవనంలో ఉంది. వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులపాలవుతున్నారు. గన్నవరం పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. శ్లాబు పెచ్చలూడి పడతున్నాయి. ఈ రెండు వసతి గృహాల భవనాల్లో కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలతోనే విద్యార్థులు సహవాసం చేస్తున్నారు.
జగ్గయ్యపేటలోని ఎస్సీ వసతి గృహంలో మూడు జతల యూనిఫాం మాత్రమే ఇచ్చారు. వత్సవాయి ఎస్సీ హాస్టల్‌లో భోజ నం సుద్దగా పెడుతుండడంతో పిల్లలు తినలేని పరిస్థితి. పెనుగంచిప్రోలు బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో పిల్లలు తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపుతున్నారు. చిల్లకల్లు ఎస్టీ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున దీన్ని రద్దుచేయాలని ప్రతిపాదనలు పంపారు. జగ్గయ్యపేటలోని బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో రక్షణ లేకుండా పోయింది.
నందిగామ నియోజకవర్గంలో రెండు వసతి గృహాలు ఉండగా వార్డెన్లు కుక్‌లకు బియ్యం, సరుకులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇక నైట్ వాచ్‌మెన్లు కూడా బయట పనుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో పిల్లలపై అజమాయిషీ కొరవడింది.
అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు బీసీ బాలుర వసతి గృహంలో వార్డెన్, నైట్ వాచ్‌మన్ లేరు. హాస్టల్ ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో నిండి ఉంది. మెనూ సక్రమంగా అమలుచేయడం లేదు. అవనిగడ్డ బీసీ బాలుర వసతి గృహం డ్రెయిన్ పక్కనే ఉండడంతో నిత్యం దుర్గంధం వెదజల్లుతోంది. వాచ్‌మన్ లేరు. మోపిదేవి ఎస్సీ బాలుర వసతి గృహంలో సరిపడినన్ని గదులు లేవు. పిల్లలు వరండాలోనే చదువుకుని అక్కడే నిద్రపోతున్నారు. ట్యూటర్లు కూడా లేరు. నాగాయలంక బీసీ బాలికల వసతి గృహం అద్దె భవనంలో నడుస్తోంది. సరిపడినన్ని గదులు లేక పిల్లలు అవస్థలు పడుతున్నారు.
గుడ్లవల్లేరు కళాశాల వసతి గృహంలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. వసతులు సక్రమంగా లేకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
నూజివీడు నియోజకవర్గంలోని వసతి గృహాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. బోరు నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారు. నాలుగు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా రెండు జతలు మాత్రమే ఇచ్చారు. కాస్మొటిక్ చార్జీలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.
పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఆరు సంక్షేమ హాస్టళ్లలోనూ రక్షిత నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పునీటినే తాగునీటిగా వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉయ్యూరు బస్టాండ్ ప్రాంతంలో, మండలంలోని ఆకునూరులో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కంకిపాడు హాస్టల్‌లో మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. ధరలు మండిపోతుండటంతో దాదాపు అన్ని హాస్టళ్లలో మెనూ అమలుకు ఇబ్బందులు పడుతున్నారు. పెనమలూరు ఎస్సీ బాలికల హాస్టల్‌లో లోఓల్టేజీ సమస్యతో రాత్రివేళ లైట్లు వెలగటం లేదు. బీసీ హాస్టల్ భవనం శ్లాబు లీకవటంతో శిథిలావస్థకు చేరింది.
విజయవాడ దేవీనగర్ బీసీ బాలికల హాస్టల్‌లో 25 మంది విద్యార్థినులకు గాను విజిట్ సందర్భంగా ఏడుగురే కనిపించారు. 15 మంది స్థానికులేనని, భోజనాల అనంతరం ఇంటికి వెళ్లిపోతారని సిబ్బంది తెలిపారు. తాగునీటికి పబ్లిక్ కుళాయే వీరికి ఆధారం. బాలుర హాస్టల్‌లో దోమల బెడద ఎక్కువగా ఉందని, దుప్పట్లు ఇచ్చినా ఇబ్బంది పడుతున్నామని, దోమతెరలు ఇస్తే బాగుంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. మాంటిస్సోరి విద్యా సంస్థల ప్రాంగణంలోని ఎస్టీ బాలికల హాస్టల్‌లో 110 మంది విద్యార్తులు ఉండగా, వారికి సరిపడినన్ని గదులు లేవు. ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఇరుక్కుని పడుకోవాల్సి వస్తోంది. మరుగుదొడ్లు కూడా నాలుగే ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కస్తూరిబాయిపేట ఎస్సీ మోడల్ హాస్టల్‌లో 175 మంది విద్యార్థినులకు గాను ఒకే ట్యాంకర్ నీళ్లు ఉండటంతో విద్యార్థినులు ఒక్కోరోజు స్నానం చేయకుండానే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.