
అటకెక్కనున్న చదువు!
– 9 నుంచి బదిలీల ప్రక్రియ
– పాయింట్లు పదనిసల్లో ఉపాధ్యాయులు
– 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
– విద్యార్థుల ప్రవేశాలు గాలికి
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్....బదిలీలు ఉన్నాయి కదా? మీకెన్ని ప్రతిభ ఆధారిత పాయింట్లు వచ్చాయి. నాకేందుకు ఇంత తక్కువ పాయింట్లు వస్తున్నాయి. పెరిగే మార్గం లేదా? ఈ పాయింట్లతో ఫలానా ప్లేస్ వస్తుందా? రాదా? ఇదీ సగటున ఇద్దరు ఉపాధ్యాయులు కలిస్తే జరుగుతున్న చర్చ. బదిలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటామో...ఉండమో...ఎక్కడికి పోతామో? మంచి స్థానం దక్కుతుందా? లేదా? అంతదూరం ఎలా వెళ్లాలి? కుటుంబం మారుద్దామంటే పిల్లల చదువులకు ఆటంకం కల్గుతుందేమో? ఇలా అంచనాలు వేసుకునే పనిలో టీచర్లు నిమగ్నమయ్యారు.
జిల్లాలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు బదిలీ జ్వరం పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా లాభం లేకపోయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వేసవి సెలవుల నుంచి అదిగోఇదిగో అంటూ ఊరిస్తూ ఎట్టకేలకు ఇటీవల టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే 9 నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమై జూలై ఒకటిదాకా సాగనుంది. ఈ 20 రోజులూ పిల్లల చదువు అటకెక్కనుంది.
విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం
పాఠశాలలు పునఃప్రారంభంలో నిర్వహించే విద్యార్థుల అడ్మిషన్లపై బదిలీల ప్రభావం పడనుంది. 1, 6, 8 తరగతుల్లో ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయి. 12న పాఠశాలలు తెరవాల్సి ఉంది. అదే రోజు టీచర్లు బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీరు పాఠశాలలకు వెళ్తారా?..లేక ఆన్‌లైన్ వద్దకు పరుగులు తీస్తారా?
55 జీఓ ఏం చెబుతోందంటే..
టీచర్లు బదిలీలు కాని, శిక్షణలు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యా సంవత్సరం మధ్యలో చేపట్టరాదు. వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ నం.55 ) విడుదల చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు చేపడుతున్నందున విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది.
దరఖాస్తు గడువు పెంచాలి
ఈ నెల 11 వరకు ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్‌ఎస్‌ఏ శిక్షణలు ఉంటాయి. 12న స్కూళ్లు పున ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితుల్లో 9–12 తేదీల్లో దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. 15 వరకు దరఖాస్తు గడువు పెంచాలి. వేసవి సెలవుల్లో పెట్టకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు.