సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఉన్న చోటికే టీచర్లను పంపించాలన్న హేతుబద్దీకరణ వ్యవహారం రెండు నెలలుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. దీంతో అనేక పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల కొరత తీవ్రంగా ఉండగా, తెలంగాణలో దాదాపు వేయి స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక మరో 1,592 స్కూళ్లలో సబ్జెక్టుటీచర్ల కొరత వల్ల గత ఏడాది బదిలీ అయిన టీచర్లను కొత్తస్థానాల్లోకి పంపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే డీఎస్సీ నిర్వహించినా టీచర్లను ఆయా స్కూళ్లకు పంపించడానికి ఐదారు నెలల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లేని స్కూళ్లలోని టీచర్లను విద్యార్థులు ఉన్నచోటకు పంపించే హేతుబద్దీరణకు ఇంకా మోక్షం లభించలేదు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విద్యార్థులుంటే టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. 350 స్కూళ్లలో విద్యార్థుల్లేకపోయినా టీచర్లు ఉన్నారు. 180 స్కూళ్లలో పదిమందిలోపే పిల్లలున్నా నలుగురేసి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక పిల్లలు ఉండీ.. టీచర్లు ఉన్న చోట సరైన బోధన అందడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇది. విద్యాశాఖ చేసిన అధ్యయనంలో తేలిన నిజాలివి. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ మార్పు చే సింది. కాని వాటి బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. గత రెండేళ్లలో ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా శిక్షణ కోసం రూ. 10 కోట్లు వచ్చినా.. శిక్షణ ఇవ్వకపోవడంతో అవి వెనక్కివెళ్లాయి. ఇందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణం. టీచర్లకు హాండ్‌బుక్స్‌కూడా ఇవ్వలేదు. అలాంటపుడు ఎలా బోధించాలని టీచర్లు వాపోతున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధవిద్యను అమలు చేయాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిస్థితులు ప్రధాన ఆటంకంగా తయారయ్యాయి.
ఇదీ స్కూళ్ల స్థితి...
- వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గురిజాల పాఠశాలలో 254 మంది విద్యార్థులుంటే ప్రభుత్వ నియమించిన టీచర్లు ఇద్దరే.
- 180 పాఠశాలల్లో పిల్లలు పది మంది లోపే ఉన్నారు. కాని వాటిల్లో ఒక్కో స్కూల్లో నలుగురు చొప్పున టీచర్లు ఉన్నారు.
- 350 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. వాటిల్లో ఒక్కరు చొప్పున టీచర్లు ఉన్నారు.
- టీచర్లు ఉండీ 25 మంది లోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నాయి.
- విద్యార్థులు ఎక్కువగా ఉన్నా ఒక్క టీచర్‌తోనే కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు 3,8,95. ప్రాథమికోన్నత పాఠశాలలు 22.
-
సబె ్జక్టు టీచర్ల కొరత ఉన్న స్కూళ్లు 2 వేలకు పైనే. ఇక గత ఏడాది బదిలీ అయినా సబ్జెక్టు టీచర్ల కొరతతో పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్న స్కూళ్లు 1,077. వారిని బదిలీ అయిన స్థానానికి పంపితే టీచరే లేకుండా పోయే స్కూళ్లు 717 ఉంటాయి.