శ్రీకాకుళం : ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల రేషనలైజేషన్‌కు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖాధికారులు రోజుకోరకమైన నిబంధనలు విధిస్తూ, నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. గురు, శుక్ర, శని వారాల్లో బదిలీలకు సంబంధించి దరఖాస్తు గడువు కాగా పలువురు ఉపాధ్యాయులు కొన్ని వివరాలు తెలియక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గురువారం నాటికి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయి వివరాలను ప్రకటించాల్సి ఉంది. జిల్లా విద్యాశాఖ ఆదర్శ పాఠశాలలు, విలీనమైన పాఠశాలల సంఖ్యను మాత్రమే గురువారం సాయంత్రం నాటికి ప్రకటించగలిగింది. జిల్లాల్లో 197 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు, వీటిలో 177 పాఠశాలలను మూసివేసి సమీపంలోని ఆదర్శ పాఠశాలల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నాటికి ఏయే పాఠశాలలు విలీనమవుతున్నాయి,
ఎక్కడెక్కడ ఆదర్శ పాఠశాలలు నెలకొల్పుతున్నారు, రేషనలైజేషన్‌లో ఉన్న ఉపాధ్యాయులెవరు? కొత్తగా మంజూరవుతున్న ఎస్‌జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్ పోస్టులు ఎక్కడెక్కడ, ఏయే పాఠశాలలో ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ వివరాలను ప్రకటించకపోవడం వల్ల ఉపాధ్యాయులు గురువారం బదిలీ దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఒకవేళ చేసుకున్నా రేషనలైజేషన్ జరిగినట్లు పొందుపరచకపోవడం వల్ల 10 పాయింట్లు కోల్పోవాల్సి వస్తోందని, దీని వల్ల తాము అనుకూలమైన పాఠశాలలను పొందలేకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు వివరాలను వెల్లడిస్తారా, లేదా అన్నది స్పష్టంకావట్లేదు. అప్పటికి కూడా ప్రకటించకుంటే ఎందరో ఉపాధ్యాయులు మరింత నష్టపోతారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు రేషనలైజేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
రోజుకో ఉత్తర్వుతో గందరగోళం
Published Fri, Sep 11 2015 12:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement