సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తును నిర్మించేది గురువులే. పునాదులు బలంగా ఉంటేనే జాతి పురోగమిస్తుంది. అందుకే నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్రం బోధనను మెరుగుపర్చడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. సమూల మార్పులు రావాలని, విద్యాబోధనలో యాంత్రిక, మూస విధానాలు పోవాలని సంకల్పించింది. టీచర్ల పనితీరును నిరంతరం మదింపు చేయాలని, సామర్థ్యం ఆధారంగానే పదోన్నతులు, వేతనాల పెంపు ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగం గా పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు పనితీరు సూచికలు (పెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్) అమల్లోకి రానున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉంది? అర్థమయ్యేలా చెబుతున్నారా? అనే అంశాల ఆధారంగా టీచర్ల పనితీరును అంచనా వేయనున్నారు.
అంతేకాదు విద్యార్థులు ఏం నేర్చుకున్నారన్న దాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ ఇండికేటర్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 2021– 22 నుంచి వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇకపై టీచర్ల పనితీరు ఆధారంగానే పదోన్నతులు, వేతనాల పెంపు విధానం అమలు చేసేలా రాష్ట్రాలు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న నిబంధనలను కూడా అందుకు అనుగుణంగా మార్పు చేయాలని కోరింది. అంతకంటే ముందు టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి టీచర్, ప్రిన్సిపాల్‌కు కచ్చితంగా 50 గంటల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సీపీడీ) ఉండేలా చూడాలంది. రాష్ట్రాల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇటీవల నూతన జాతీయ విద్యా విధానంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఆదేశాలను జారీ చేసింది.
బదిలీల్లోనూ ప్రాధాన్యం
టీచర్లు కనబర్చే ప్రతిభ,, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని పేర్కొంది. టీచర్స్ కెరీర్ ప్రోగ్రాంను రాష్ట్రాలు రూపొందించుకోవాలని, ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలను మార్పు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, నాయకత్వంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సీనియారిటీ ఆధారంగా కాకుండా సర్టిఫికెట్ కోర్సు చేసిన వారిని ప్రధానోపాధ్యాయుడిగా నియమిస్తేనే బాగుంటుందని యోచిస్తోంది. కొత్తగా టీచర్లుగా నియమితులైన వారు పాఠశాలల్లో విధుల్లో చేరడానికంటే ముందే ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో వారికి ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వనుంది. మరోవైపు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
► తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకు ముందు టీచర్లు ఏం చేయాలి. ఏం చేస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
► పిల్లల పురోగతి తెలుసుకొని తగిన చర్యలు చేపట్టేందుకు ఆన్‌లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దానిద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తక్షణ చర్యలు చేపడతారు.
► టీచర్లకు సబ్జెక్టుపై, బోధనలోని స్టెప్స్‌పై (ఏ పాఠ్యాంశం తర్వాత ఏది చెప్పాలనేది) శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.
► ప్రతినెలా సబ్జెక్టుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వృత్తిపరమైన నైఫుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తారు.
బోధన యాంత్రికం
పాఠశాలల్లో విద్యాబోధనలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ విషయం గతంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ... రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించిన సర్వేలోనే తేలింది. బోధన సరిగ్గా జరగడం లేదన్న నిర్ణయానికి వచ్చింది. ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారని, పాఠ్యపుస్తకాల్లోని ముందుమాట కూడా సరిగ్గా చదవకుండానే పాత పద్ధతిలో బోధిస్తున్నారని తేల్చింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని ముందుమాట చదివి బోధన చేపట్టాల్సి ఉంటుంది. కాని వాటిని చదివి అర్థం చేసుకొని పాఠాలు బోధిస్తున్న వారు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ అంచనాకు వచ్చింది. మిగిలిన వారు మొక్కుబడిగా బోధన కొనసాగిస్తున్నారని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment