టీచర్ల బదిలీలు ఆపేయాలని నేనే విజ్ఞప్తి చేశా: బొత్స | Ex Minister Botsa Reacts On AP Teachers Transfers Allegations | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీలు ఆపేయాలని నేనే విజ్ఞప్తి చేశా: ఆరోపణలను ఖండించిన బొత్స

Published Fri, Jun 7 2024 3:16 PM | Last Updated on Fri, Jun 7 2024 3:16 PM

Ex Minister Botsa Reacts On AP Teachers Transfers Allegations

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీల అంశంలో తనపై వస్తున్న ఆరోపణలను మరోసారి ఖండించారు మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఆ బదిలీలను నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని స్పష్టత ఇచ్చారాయన.

టీచర్ల బదిలీ అంశంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్న ఆయన.. శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవం. నాపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన వార్తల్లో నిజం లేదు. ఇదంతా అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు.

.. ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించారు. అప్పుడు కూడా నేను ఖండించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే అప్పట్లో నిర్ణయం తీసుకున్నాం.

అయితే.. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సిందిగా సంబంధిత అధికారులను నేనే స్వయంగా కోరాను. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలపై తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం అర్జీచేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనేది కొత్త ప్రభుత్వం ఇష్టం.

అంతేగానీ.. బదిలీలకోసం లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం రెండూ మాకు లేవు.. అని బొత్స స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement