సీఎంకు రాసిన పోస్టుకార్డులను చూపుతున్న విద్యార్థులు
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల... మూసివేసే దశ నుంచి ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమ పాఠశాలగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. అలాంటి పాఠశాలలో బదిలీల ప్రక్రియలో ఒక్కరే ఉపాధ్యాయుడు మిగిలారు. తమ భవిష్యత్‌ను కాపాడాలంటూ విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు.
అసలు సమస్య ఇదీ..
2015–16లో 8 మంది ఎస్జీటీ, ఒక టీపీటీ పోస్టుతో ఆంగ్ల మాధ్యమంలో 7వ తరగతి వరకు పునఃప్రారంభమైన ఈ పాఠశాల.. తరువాత పదవ తరగతి వరకు అప్‌గ్రేడైంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాకుండానే అప్‌గ్రేడ్ కావడంతో సమస్యలు మొదలయ్యాయి. విద్యాకమిటీ సొంత డబ్బులతో కొందరు ప్రైవేట్ టీచర్లను ఏర్పాటుచేసుకుంది. మరోపక్క ఏడవ తరగతి వరకే బోధించాల్సిన ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలలో ఆంగ్లమాధ్యమంలో బోధించడం కష్టమైనప్పటికి, పాఠశాల అప్‌గ్రేడ్ అవుతున్న విధంగా వారూ అప్‌గ్రేడ్ అయ్యారు.
దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద తరగతులకు, ప్రాథమిక పాఠశాలకు ప్రైవేట్ ఉపాధ్యాయులతో బోధన కొనసాగించారు. ఉన్నతాధికారులు సాంకేతిక కారణాలతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం మంజూరు చేయట్లేదు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన బదిలీలతో పాఠశాలలోని 8 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఒకే ఉపాధ్యాయుడు మిగిలారు. దీంతో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న 8 ఎస్జీటీ పోస్టులకు అదనంగా 7 స్కూల్ అసిస్టెంట్, ఒక పీజీ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దేవసేనకు 468 మంది విద్యార్థులు కార్డులు రాసి గురువారం పోస్టుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment