సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా వెల్లడైంది. ఆదివారం ఉదయం ఈ జాబితాను అధికారులు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లో ప్రవేశపెట్టారు. వాస్తవానికి సీనియారిటీ లిస్టు శనివారమే ప్రకటించాల్సి ఉండగా.. అధికారుల్లో నెలకొన్న గందరగోళంతో జాబితా తయారీలో జాప్యం జరిగింది. ఆదివారం జాబితా ప్రకటించినప్పటికీ.. ఆ వివరాల్లో భారీగా తప్పులుదొర్లాయి. ఉపాధ్యాయులకిచ్చే సర్వీసు పాయింట్లు, స్పౌజ్, అంతర్‌జిల్లా బదిలీలపై వచ్చిన టీచర్ల సర్వీసు పరిగణనలో అధికారులు లెక్కకు మించి పాయింట్లు కేటాయించారు. దీంతో సీనియర్లు.. జూనియర్లుగా మారి జాబితాలో కిందివరుసకు పడిపోయారు.
లెక్కలు తారుమారు..
సీనియారిటీ జాబితాల్లో టీచర్ల పాయింట్లు తారుమారయ్యాయి. నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరిన ప్రతి టీచర్‌కు సర్వీసు పాయింట్ల కింద నెలకు 0.041 పాయింట్లు కేటాయించాలి. ఈ గణాంకాల ఆధారంగా సీనియారిటీ జాబితాల్లో పాయింట్లు ఇవ్వాలి. కానీ కొందరు టీచర్లకు సర్వీసు పాయింట్ల కేటగిరీలో ఏకంగా 20 పాయింట్లు దాటిపోయాయి. ఇన్ని పాయింట్లు రావాలంటే సదరు టీచరుకు 40 సంవత్సరాల సర్వీసు ఉండాలి. కానీ జూనియర్ టీచర్లకు ఇదే తరహాలో అడ్డగోలుగా పాయింట్లు కేటాయించారు.
ఫలితంగా వారంతా పైవరుసలో ఉండిపోగా.. సీనియర్ టీచర్లు కింది వరుసకి చేరారు. మరోవైపు అంతర్‌జిల్లా బదిలీపై జిల్లాకు వచ్చిన టీచర్లకు కూడా పాయింట్ల కేటాయింపు ఇష్టానుసారంగా చేర్చారు. అంతర్‌జిల్లా బదిలీపై వచ్చే టీచరు సర్వీసును జిల్లాలో చేరినప్పటి తేదీనుంచి పరిగణించాలి. అలాకాకుండా మొదటగా పోస్టింగ్ తీసుకున్న తేదీని పరిగణనలోకి తీసుకోవడంతో స్థానిక టీచర్లు జాబితాలో చివర్లోకెళ్లారు.
భార్యాభర్తలిరువురు ఉద్యోగస్తులైతే వారిద్దరు ఒకేచోట పనిచేసేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇందుకు ఒకరికి స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తుంది. ఒకరికి కాకుండా ఇద్దరికీ స్పౌజ్ పాయింట్లు ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులు ఇద్దరూ జాబితాలో ముందువరుసకు చేరడంతో సీనియర్ టీచర్లు నష్టపోవాల్సివస్తోంది. మరోవైపు ఎనిమిదేళ్లలో ఒకేసారి స్పౌజ్‌పాయింట్లు వాడుకోవాల్సి ఉండగా.. రెండుసార్లు వినియోగించుకునేలా దరఖాస్తు చేసుకున్నారు.
ఇలా పలు విషయాల్లో తప్పులు దొర్లడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాథమిక జాబితా అయినప్పటికీ.. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పొరపాట్లు జరిగాయని ఆరోపిస్తున్నాయి. కాగా.. సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కూకట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు తగిన ఆధారాలతో రావాల్సిందిగా విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
వారు.. వీరయ్యారు!
Published Mon, Jul 6 2015 1:12 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement