సాక్షి, హైదరాబాద్ : విద్యాశాఖలో అడ్డదారి బదిలీలకు తెరలేచింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఏకంగా వందలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ గుట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగులకు సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. బదిలీ మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమ బదిలీల ప్రక్రియ విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. బుధవారం రాత్రి దాదాపు 100 మంది టీచర్లను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 150 మంది టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో అత్యధికులు అంతర్ జిల్లా (ఇతర జిల్లాలకు) బదిలీలు పొందగా.. మరికొందరు జిల్లా పరిధి (విత్ ఇన్ డిస్ట్రిక్ట్)లో బదిలీ అయ్యారు.
పలుకుబడికే పట్టం
టీచర్ల బదిలీలకు భారీ మంత్రాంగమే నడిచింది. ప్రముఖుల అండదండలున్న టీచర్లకే స్థానచలనం కలిగింది. ఒక్కో టీచర్ బదిలీకి భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలిసింది. సాధారణ బదిలీలు జరిగితే పట్టణ ప్రాంత పోస్టులు భర్తీ అవుతాయని భావించిన కొందరు రాజకీయ నేతలు.. అధికారులతో చేతులు కలిపి దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. అందులో భాగంగా ప్రత్యేక ఉత్తర్వులతో పట్టణ ప్రాంతాల్లో పాగా వేయాలని భావించి రంగంలోకి దిగారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీచర్ల బదిలీ వ్యవహారం సాఫీగా జరిగింది. వాస్తవానికి ఒకట్రెండు రోజుల్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక బదిలీలు చేపట్టొద్దని సంఘాలు స్పష్టం చేశాయి. మంత్రి సైతం అంగీకరించారు. కానీ సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే అడ్డగోలుగా బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.
30 శాతం హెచ్‌ఆర్‌ఏ కోసం..
తాజాగా బదిలీ పొందిన వారంతా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకే ట్రాన్స్‌ఫర్ అయ్యారు. పట్టణ ప్రాంతాల బదిలీకి ప్రధాన కారణం 30 శాతం హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) రావడమే. అంతేకాకుండా రాజధాని నగరంలో నివసించే వెసులుబాటు ఉంటుందని భావించిన టీచర్లు భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చుకుని మరీ దొడ్డిదారిలో బదిలీలు పొందారు. బుధవారం రాత్రి వచ్చిన బదిలీ ఉత్తర్వుల్లో సగానికిపైగా టీచర్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకే వచ్చారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు పరుగులు పెట్టారు. ఉదయం పదిన్నర గంటల సమయంలోనే డీఈవో కార్యాలయాలకు వచ్చి రిపోర్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్‌లో 19, కరీంనగర్‌లో 12 బదిలీలు జరిగాయి. మిగతా బదిలీలు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో జరిగినట్టు తెలిసింది.
స్థానికులకు అన్యాయమే!
ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల వ్యవహారంతో స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరగనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోనున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుల నిష్పత్తి పరిమితికి మించి ఉంది. సాధారణంగా 20 శాతం ఉండాల్సిన స్థానికేతర నిష్పత్తి.. 40 శాతాన్ని మించింది. తాజాగా మరిన్ని అంతర్ జిల్లా బదిలీలు కావడంతో జిల్లాలో ఉన్న ఖాళీలు తగ్గిపోనున్నాయి. దీంతో నియామకాల సమయంలో స్థానిక అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోనున్నాయి.
మండిపడ్డ సంఘాలు.. రేపు డైరెక్టరేట్ ముట్టడి
అడ్డదారి బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఎస్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీఆర్‌టీయూ సంఘాల నేతలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి ప్రభుత్వమే ఇలా అడ్డదారిలో బదిలీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం కేంద్రంగా పైరవీ బదిలీలు జరగడం దారుణమన్నారు. ఈ బదిలీల రద్దుకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment