విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యం ఉన్న సీనియార్టీ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. పనితీరుకు పాయింట్లు వేస్తుండడంతో చాలా మంది పైరవీలతో పాయింట్లు పొందుతున్నారని, దీని వల్ల సహజంగా ఉన్న సీనియార్టీకి అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళనచెందుతున్నారు. బుధవారం రాత్రి విడుదల చేసి ప్రొవిజినల్ సీనియార్టీపై ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ఒక్క సీనియార్టీపైనే కాకుండా సెలవుల వినియోగం, స్పౌజ్‌కోటా పాయింట్లు ఇలా మిగతావాటిపై కూడా కుప్పలుతెప్పలుగా అభ్యంతరాలు డీఈఓ కార్యాలయానికి చేరుతున్నాయి. బదిలీకోసం 4,201 మంది దరఖాస్తు చేసుకోగా గురువారం సాయంత్రానికి 250కి పైగా ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాశాఖకు అందాయి. అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో శుక్రవారం కూడా స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. బదిలీల్లో తమకు అదనంగా పాయింట్లు వస్తాయని కొందరు, తమకు ఫలానా అంశాల్లో పాయింట్లను తగ్గించారని మరికొందరు, తమ సహచర ఉపాధ్యాయులు పాయింట్ల కోసం అడ్డదారులు తొక్కారని ఇంకొందరు ఫిర్యాదులు చేశారు.
ఓపెన్‌కాని దరఖాస్తులు
జిల్లా విద్యాశాఖాధికారికి అందిన ఉపాధ్యాయుల దరఖాస్తులను డీఈఓ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ధ్రువీకరిస్తేనే ఈ ఉపాధ్యాయులు బదిలీ కోసం వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే గురువారం కొన్ని మండలాల్లోని ఉపాధ్యాయుల దరఖాస్తులు డీఈఓ లాగిన్‌లో ఓపెన్ కాలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఐదు మండలాలలో ఎదురైన ఈ సమస్య మధ్యాహ్నానికి పరిష్కారమైంది. సమయాభావం వల్ల బొబ్బిలి డివిజన్ పరిధిలోని శివార్లలో ఉన్న మండలాల నుంచి ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.
పాయింట్లలో అయోమయం
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాయింట్ల కేటాయింపులో అయోమయం కొనసాగుతోంది.
ధికంగా 10 పాయింట్లు వచ్చే స్పౌజ్ కోటా టీచర్ల విషయంలో ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. ఇవి 75 వరకు ఉన్నాయి.
భార్యాభర్తలిద్దురూ ఎనిమిదేళ్ల సర్వీసులో ఈ కోటాను ఉపయోగించుకుంటే ప్రస్తుత బదిలీలో ఈ పాయింట్లు వర్తించవనే నిబంధన ఉంది.
ఈ కోటాను గతంలో వినియోగించుకున్నప్పటికీ కొందరు దరఖాస్తు చేసినట్టు పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
అదే విధంగా ఉపాధ్యాయుల సర్వీసు పాయింట్లకు 75 శాతం, వ్యక్తిగత పనితీరుకు పాయింట్లకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
సర్వీసుకు, వ్యక్తిగత పనితీరుకు కేటాయించిన పాయింట్లు కలగలిపి ప్రొఫార్మాలో కనిపిస్తుండడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు.
ఈ పాయింట్ల విషయంలో విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు పాయింట్ల కోసం పక్కదార్లు తొక్కుతున్నారని సహచరులే వాపోతున్నారు.
దొడ్డిదారిన మార్కులు కొట్టేసి తప్పుడు ధ్రువీకరణలతో దరఖాస్తు చేసుకుంటున్న ఉదంతాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామం ఉపాధ్యాయల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. అర్జీలను నిశితంగా పరిశీలించి ఆమోదించాల్సిన ఎంఈఓలు ప్రలోభాలకు పాల్పడటం, వారి అండతో ఉపాధ్యాయులు తప్పుడు ద్రువీకరణ సమర్పిస్తున్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మహిళా ఉపాధ్యాయులు సిక్ లీవ్(సీఎల్)లు వినియోగించుకుంటే 88 శాతం మాత్రమే హాజరు శాతం వస్తోంది. అయితే దరఖాస్తుల్లో సీఎల్‌కు బదులుగా ప్రసవ సెలవులను వినియోగించుకున్నట్టు మార్చి 90 నుంచి 95 శాతం హాజరు చూపించారని ఫిర్యాదులు అందాయి. హాజరు పట్టికలను పరిశీలించడంలో మండల కమిటీ పక్షపాతం చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి.
‘విరాళాల’కు వక్రభాష్యం
జిల్లాలో దాతల నుంచి విరాళాలు సేకరించిన ఉపాధ్యాయునికి పాయింట్లు వస్తాయి. విజయనగరం డివిజన్ పరిధిలో కొందరు ఉపాధ్యాయులు దీనికి వక్రభాష్యం చెబుతూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని సమాచారం. రెండు పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను తాము సేకరించిన ఖాతాల్లో రాసుకొని కొందరు టీచర్లు పాయింట్ల పొందారు. ఇలాంటివి బొబ్బిలి డివిజన్‌లో కూడా ఉన్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెపుతున్నాయి.
పొంతన లేని సమాచారం
నిజానికి ఉపాధ్యాయులు ఇచ్చిన దరఖాస్తులను, అన్ని ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఎంఈఓలు స్కాన్ చేసి డీఈఓకు పంపాలి. జిల్లాలోని అన్ని మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈఓలే ఉన్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో స్కానర్లు లేకపోవడంతో ఈ పనిని బయట నెట్ సెంటర్ల వద్ద చేయిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్యకు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కనిపించే సంఖ్యకు పొంతన కుదరటం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
బది‘లీలల’పైబది‘లీలల’పై భారీగా అభ్యంతరాలు!
Published Thu, Sep 24 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement