బదిలీ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు | Teachers to expect for transfer after completion of counselling | Sakshi
Sakshi News home page

బదిలీ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు

Published Tue, Nov 4 2014 2:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

బదిలీ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు

బదిలీ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు

కౌన్సెలింగ్ పూర్తయి ఏడాది..  
స్థానచలనానికి నోచుకోని ఉపాధ్యాయులు
రిలీవర్ రాలేదనే నెపంతో నిలిపివేత
బదిలీ కోసం 166 మంది ఎదురుచూపు
ప్రభుత్వ నిబంధనల మేరకే అంటున్న విద్యాశాఖ అధికారులు

 
ఖమ్మం: పనిచేస్తున్న పాఠశాల నుంచి బదిలీ అయింది, కొత్త స్కూల్‌కు వెళ్లొచ్చు అని సుదూర ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు.. ఇద్దరం ఒకేచోట కలిసి పనిచేయొచ్చని సంతోషించిన ఉపాధ్యాయ దంపతులు.. ఇలా ఎంతోమంది ఆశలపై విద్యాశాఖాధికారులు నీళ్లు చల్లారు. ఉత్తర్వులు తీసుకుని సంవత్సరం కావస్తున్నా రిలీవర్ రాలేదనే నెపంతో బదిలీలు నిలిపివేస్తున్నారు. దీంతో తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.  
 
 ఏడాదిగా నిరీక్షిస్తున్న 166 మంది...
 ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో అంగీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులు 2013 మే 13,14,15 తేదీల్లో  ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని రకాల కేటగిరీలకు చెందిన 4,919 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 1376 మందికి స్థానచలనం కలిగింది.  వీరిలో పీజీహెచ్‌ఎంలు 28, ఎస్‌ఏ తెలుగు 11, ఎస్‌ఏ హిందీ 11, ఎస్‌ఏ ఇంగ్లీష్ 8, ఎస్‌ఏ పీడీ -1, ఎస్‌ఏ మ్యాథ్స్ 73, ఎస్‌ఏ ఫిజిక్స్ 35, బయలాజికల్ సైన్స్ 60, సోషల్ స్టడీస్ 98, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం 82, ఏజన్సీ ప్రాంత ఎస్‌జీటీలు 523, మైదాన ప్రాంత ఎస్‌జీటీలు 416, లాంగ్వేజీ పండిట్(తెలుగు) 14, లాంగ్వేజీ పండిట్ (హిందీ) 4, పీఈటీ 4, డ్రాఫ్ట్ ఉపాధ్యాయులు 3, మ్యూజిక్ టీచర్ ఒకరు ఉన్నారు. అయితే ఇందులో 166 మంది ఇప్పటివరకు తాము పాఠశాలల నుంచి రిలీవ్ కాలేదు. ఇందులో 69 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు, 71 మంది టీచర్ లెస్ స్కూల్‌లో పనిచేస్తున్నవారు, మిగిలిన 26 మంది సబ్జెక్టు టీచర్లు ఉన్నారు. వీరు అక్కడి నుంచి బయటకు రావాలంటే ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడు వెళ్లాలి.
 
 ఆయా పాఠశాలలకు మరో ఉపాధ్యాయుడిని పంపించక పోవడంతో బదిలీ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు చైన్ విధానంలా ఉన్నారని, ఒకరు రిలీవ్ అయితే వారి స్థానంలో మరొకరు, అక్కడికి మరొకరు వచ్చే అవకాశం ఉందని, దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
 
 రిలీవ్ చేస్తారా..  కొత్తగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారా..
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ జరిగి 18 నెలలు గడుస్తున్నా 166 మందిని పాత పాఠశాలల్లోనే ఉంచారు. అయితే ఈ సమయంలో ఇతర ఉపాధ్యాయులు పలువురు  ఉద్యోగ విరమణ పొందడం, పదోన్నతులతో వేరే చోటుకు బదిలీ కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా ఏర్పడిన ఖాళీలనైనా తమతో భర్తీ చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 
 ప్రభుత్వ నిబంధనల మేరకే రిలీవ్ చేయలేదు
 రవీంద్రనాధ్‌రెడ్డి, డీఈవో
 ఏకోపాధ్యాయుడు, టీచర్ లెస్ పాఠశాలల్లో పనిచేసేవారు, హైస్కూళ్లలో పనిచేసే సబ్జెక్టు టీచర్లను రిలీవ్ చేయాలంటే ఆయన స్థానంలో మరొకరు రావాలి. ఇది ఉన్నతాధికారుల ఆదేశం. అందుకోసమే రిలీవ్ చేయలేదు. ప్రభుత్వం ఆదేశాలు ఏవిధంగా వస్తే వాటిని పాటిస్తాం. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలా, గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను అమలు చేయాలా అనేది ప్రభుత్వ నిర్ణయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement