Teacher couple
-
అసలేం జరిగిందో?: రక్తపు మడుగులో భార్య.. విగతజీవిగా భర్త
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో శనివారం ఉపాధ్యాయ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో సబ్‌కలెక్టర్ ఆఫీసు సమీపంలోని సూర్య థియేటర్ వద్ద ఎస్ఆర్ ప్లాజాలో ఉంటున్న నడింపల్లి నర్సింహరాజు(59) నిడదవోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య వెంకటమణి(55) రాజమహేంద్రవరం ఉమెన్స్ కాలేజీలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. వారి కుమారుడు అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ ఎప్పటిలాగే నిద్ర పోయారు. శనివారం మధ్యాహ్నం వరకూ తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. పక్కింటివారు కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరిచి పరిశీలించగా మంచంపై రక్తపు మరకలతో భార్య పడి ఉండగా, భర్త కుర్చీలో చనిపోయి ఉన్నాడు. అతని చేతిలో చాకు ఉంది. భార్య గొంతుకోసి, తాను గొంతుకోసుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. నర్సింహరాజు భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా మరేమైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాపు చేస్తున్నారు. కుర్చీలో శవమైన నర్శింహరాజు చేతిలో చాకు కింద పడకుండా ఉండడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. -
ఇంకెన్నాళ్లు..?
సాక్షి, హైదరాబాద్: భర్త ఒక చోట.. భార్య ఒక చోట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందల మంది ఉపాధ్యాయులు ఇలా నాలుగున్నరేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజనతో దూరమైన టీచర్ దంపతులు ఒక్క చోటుకి చేరేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ఒక్కటి చేసేందుకు గతేడాది అంగీకరించినా అధికారులు రూపొందించిన నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. ఒక టీచర్ తెలంగాణకు వస్తే మరో టీచర్ ఏపీకి వెళ్లేలా పరస్పర (మ్యూచువల్) బదిలీలకు ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. అయితే ఆ బదిలీల అమలుకు అధికారులు విధించిన నిబంధనలే వారిని దగ్గర కానివ్వడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిబంధనల కారణంగా పదుల సంఖ్యలో టీచర్లకే లబ్ధి చేకూరింది. నిబంధనల్లో ఏముందంటే.. అంతర్రాష్ట్ర బదిలీల కోసం టీచర్ల నుంచి వెల్లువెత్తిన విజ్ఞప్తుల మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో గతేడాది ఉన్నతాధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. దాని సిఫారసుల మేరకు అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలుపుతూ 2017 ఆగస్టు 7 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అయితే స్పౌజ్, పరస్పర కేటగిరీలో బదిలీ కోరుకునే ఇద్దరు టీచర్లు ఒకే సబ్జెక్టు కలిగి ఉండాలని, ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తూ ఉండాలని, స్థానికత (నేటివిటీ) కలిగి ఉండాలని నిబంధన విధించారు. ఈ నిబంధనే అనేక మందికి శాపంగా మారింది. అంతర్రాష్ట్ర బదిలీ కోసం పరస్పర కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు వందల మంది ఉన్నా.. ఒకే సబ్జెక్టు, ఒకే మేనేజ్మెంట్, నేటివిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నారు. దీంతో వందల మంది పరస్పర బదిలీకి అర్హత లేకుండాపోయింది. ఈ నిబంధనల కారణంగా దాదాపు 300 మంది వరకు అసలు దరఖాస్తు కూడా చేసుకోపోగా, దరఖాస్తు చేసుకున్న 250 మందిలో కూడా తక్కువ మందికే లబ్ధి చేకూరింది. కేవలం 20 మంది టీచర్లకు మాత్రమే ఇటీవల బదిలీ జరిగింది. మిగతా వారికి బదిలీలు జరిగే అవకాశం లేకుండాపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆ బదిలీల ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడిగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో వారంతా ఆందోళనలో పడ్డారు. కమిటీ ఉత్తర్వుల ఆలస్యంతో ఆందోళన.. అధికారుల నిబంధనలతో ఎక్కువ మంది టీచర్లకు అంతర్రాష్ట బదిలీకి అవకాశమే లేకుండాపోతోందని టీచర్లు ప్రభుత్వానికి మళ్లీ అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఉన్నతాధికారుల కమిటీ ఆ నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. అయితే కమిటీ నిర్ణయంపై ఇంతవరకు ఉత్తర్వులు జారీ కాకపోవడం, మరోవైపు బదిలీలకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో సంబంధిత టీచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘హెడ్ టు హెడ్’మ్యూచువల్ బదిలీకి అవకాశం ఇవ్వడం వల్ల ఇరు ప్రభుత్వాలకు అదనంగా ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, తమకు బదిలీకి అవకాశం కల్పించి తమ కుటుంబాల దగ్గరకు వెళ్లేలా చూడాలని కోరుతున్నారు. -
బదిలీ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు
కౌన్సెలింగ్ పూర్తయి ఏడాది.. స్థానచలనానికి నోచుకోని ఉపాధ్యాయులు రిలీవర్ రాలేదనే నెపంతో నిలిపివేత బదిలీ కోసం 166 మంది ఎదురుచూపు ప్రభుత్వ నిబంధనల మేరకే అంటున్న విద్యాశాఖ అధికారులు ఖమ్మం: పనిచేస్తున్న పాఠశాల నుంచి బదిలీ అయింది, కొత్త స్కూల్‌కు వెళ్లొచ్చు అని సుదూర ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు.. ఇద్దరం ఒకేచోట కలిసి పనిచేయొచ్చని సంతోషించిన ఉపాధ్యాయ దంపతులు.. ఇలా ఎంతోమంది ఆశలపై విద్యాశాఖాధికారులు నీళ్లు చల్లారు. ఉత్తర్వులు తీసుకుని సంవత్సరం కావస్తున్నా రిలీవర్ రాలేదనే నెపంతో బదిలీలు నిలిపివేస్తున్నారు. దీంతో తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా నిరీక్షిస్తున్న 166 మంది... ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో అంగీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులు 2013 మే 13,14,15 తేదీల్లో ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని రకాల కేటగిరీలకు చెందిన 4,919 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 1376 మందికి స్థానచలనం కలిగింది. వీరిలో పీజీహెచ్ఎంలు 28, ఎస్ఏ తెలుగు 11, ఎస్ఏ హిందీ 11, ఎస్ఏ ఇంగ్లీష్ 8, ఎస్ఏ పీడీ -1, ఎస్ఏ మ్యాథ్స్ 73, ఎస్ఏ ఫిజిక్స్ 35, బయలాజికల్ సైన్స్ 60, సోషల్ స్టడీస్ 98, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం 82, ఏజన్సీ ప్రాంత ఎస్జీటీలు 523, మైదాన ప్రాంత ఎస్జీటీలు 416, లాంగ్వేజీ పండిట్(తెలుగు) 14, లాంగ్వేజీ పండిట్ (హిందీ) 4, పీఈటీ 4, డ్రాఫ్ట్ ఉపాధ్యాయులు 3, మ్యూజిక్ టీచర్ ఒకరు ఉన్నారు. అయితే ఇందులో 166 మంది ఇప్పటివరకు తాము పాఠశాలల నుంచి రిలీవ్ కాలేదు. ఇందులో 69 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు, 71 మంది టీచర్ లెస్ స్కూల్లో పనిచేస్తున్నవారు, మిగిలిన 26 మంది సబ్జెక్టు టీచర్లు ఉన్నారు. వీరు అక్కడి నుంచి బయటకు రావాలంటే ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడు వెళ్లాలి. ఆయా పాఠశాలలకు మరో ఉపాధ్యాయుడిని పంపించక పోవడంతో బదిలీ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు చైన్ విధానంలా ఉన్నారని, ఒకరు రిలీవ్ అయితే వారి స్థానంలో మరొకరు, అక్కడికి మరొకరు వచ్చే అవకాశం ఉందని, దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రిలీవ్ చేస్తారా.. కొత్తగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారా.. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ జరిగి 18 నెలలు గడుస్తున్నా 166 మందిని పాత పాఠశాలల్లోనే ఉంచారు. అయితే ఈ సమయంలో ఇతర ఉపాధ్యాయులు పలువురు ఉద్యోగ విరమణ పొందడం, పదోన్నతులతో వేరే చోటుకు బదిలీ కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా ఏర్పడిన ఖాళీలనైనా తమతో భర్తీ చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే రిలీవ్ చేయలేదు రవీంద్రనాధ్‌రెడ్డి, డీఈవో ఏకోపాధ్యాయుడు, టీచర్ లెస్ పాఠశాలల్లో పనిచేసేవారు, హైస్కూళ్లలో పనిచేసే సబ్జెక్టు టీచర్లను రిలీవ్ చేయాలంటే ఆయన స్థానంలో మరొకరు రావాలి. ఇది ఉన్నతాధికారుల ఆదేశం. అందుకోసమే రిలీవ్ చేయలేదు. ప్రభుత్వం ఆదేశాలు ఏవిధంగా వస్తే వాటిని పాటిస్తాం. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలా, గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను అమలు చేయాలా అనేది ప్రభుత్వ నిర్ణయం. -
కిడ్నాప్ కలకలం
భీమవరం అర్బన్ : భీమవరం పట్టణంలో ఉపాధ్యాయ దంపతుల కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. సోమవారం మధ్యాహ్నానికి బయటకు పొక్కింది. అప్రమత్తమైన పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టేందుకు 9 బృందాలను రంగంలోకి దింపారు. సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి ఫోన్ చేసిన ఆ దంపతులిద్దరూ తాము క్షేమంగా ఉన్నామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి భీమవరం టూటౌన్ సీఐ ఆర్.జయసూర్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక టూటౌన్‌లోని అడ్డవంతెన సమీపంలో నివసిస్తున్న పెన్మెత్స సీతారామరాజు కాళ్ల జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా, అతని భార్య రామసీత కోపల్లె జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆరుగు వ్యక్తులు రెండు కార్లలో వచ్చి దంపతులిద్దరినీ ఎత్తుకెళ్లారని వారి ఇంట్లో అద్దెకు ఉంటు న్న కూనపరాజు ఆంజనేయరాజు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఉపాధ్యాయుడు సీతారామరాజుకు, అతని ఇంటికి పక్కనే ఉంటున్న పసుపులేటి మురళీకృష్ణకు ఏడేళ్లుగా సరిహద్దు తగాదా ఉంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. అతడే వారిని కిడ్నాప్ చేయించినట్టు తమకు ఫిర్యాదు అందిందని సీఐ చెప్పారు. కిడ్నాప్‌నకు గురైన దంపతుల ఇంటిని నరసాపురం డీఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. సీతారామరాజు బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వేలి ముద్రలను సేకరించింది. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ దంపతుల ఆచూకీ కనిపెట్టేందుకు 9 బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన సీతారామరాజు నివాసం ఉంటున్న ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రి వద్ద గల సీసీ కెమెరాల్లో పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో రెండు కార్లు అటువైపు వేగంగా వెళ్లినట్టు అందులో రికార్డు అరుునట్టు సమాచారం. బెంగళూరు ప్రాంతంలో వదిలిపెట్టిన కిడ్నాపర్లుసీతారామరాజు దంపతులను బెంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో కిడ్నాపర్లు వదిలిపెట్టారని సోమవారం సాయంత్రం తమకు సమాచారం అందినట్టు సీఐ జయసూర్య తెలిపారు. ఇంటి సరిహద్దు విషయమై సీతారామరాజు కోర్టులో కేసు వేశారని, కేసును విరమించుకోవాలని ఆ భవనం యజమాని గతంలో చెప్పినా వినకపోవడం వల్లే కిడ్నాప్‌నకు పథకం వేశారని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, బెంగళూరు నుంచి సీతారామరాజు, రామసీత దంపతులను క్షేమంగా భీమవరం తీసుకొస్తున్నామని చెప్పారు.