కిడ్నాప్ కలకలం
భీమవరం అర్బన్ : భీమవరం పట్టణంలో ఉపాధ్యాయ దంపతుల కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. సోమవారం మధ్యాహ్నానికి బయటకు పొక్కింది. అప్రమత్తమైన పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టేందుకు 9 బృందాలను రంగంలోకి దింపారు. సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి ఫోన్ చేసిన ఆ దంపతులిద్దరూ తాము క్షేమంగా ఉన్నామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి భీమవరం టూటౌన్ సీఐ ఆర్.జయసూర్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక టూటౌన్‌లోని అడ్డవంతెన సమీపంలో నివసిస్తున్న పెన్మెత్స సీతారామరాజు కాళ్ల జెడ్పీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా, అతని భార్య రామసీత కోపల్లె జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆరుగు వ్యక్తులు రెండు కార్లలో వచ్చి దంపతులిద్దరినీ ఎత్తుకెళ్లారని వారి ఇంట్లో అద్దెకు ఉంటు న్న కూనపరాజు ఆంజనేయరాజు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఉపాధ్యాయుడు సీతారామరాజుకు, అతని ఇంటికి పక్కనే ఉంటున్న పసుపులేటి మురళీకృష్ణకు ఏడేళ్లుగా సరిహద్దు తగాదా ఉంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. అతడే వారిని కిడ్నాప్ చేయించినట్టు తమకు ఫిర్యాదు అందిందని సీఐ చెప్పారు. కిడ్నాప్‌నకు గురైన దంపతుల ఇంటిని నరసాపురం డీఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. సీతారామరాజు బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వేలి ముద్రలను సేకరించింది. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ దంపతుల ఆచూకీ కనిపెట్టేందుకు 9 బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు.
సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన
సీతారామరాజు నివాసం ఉంటున్న ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రి వద్ద గల సీసీ కెమెరాల్లో పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో రెండు కార్లు అటువైపు వేగంగా వెళ్లినట్టు అందులో రికార్డు అరుునట్టు సమాచారం.
బెంగళూరు ప్రాంతంలో వదిలిపెట్టిన కిడ్నాపర్లుసీతారామరాజు దంపతులను బెంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో కిడ్నాపర్లు వదిలిపెట్టారని సోమవారం సాయంత్రం తమకు సమాచారం అందినట్టు సీఐ జయసూర్య తెలిపారు. ఇంటి సరిహద్దు విషయమై సీతారామరాజు కోర్టులో కేసు వేశారని, కేసును విరమించుకోవాలని ఆ భవనం యజమాని గతంలో చెప్పినా వినకపోవడం వల్లే కిడ్నాప్‌నకు పథకం వేశారని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, బెంగళూరు నుంచి సీతారామరాజు, రామసీత దంపతులను క్షేమంగా భీమవరం తీసుకొస్తున్నామని చెప్పారు.