వచ్చే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ! | Rationalization of teachers in the next month! | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!

Published Mon, Oct 24 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

వచ్చే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!

వచ్చే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!

కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
- రేపటికల్లా పూర్తి స్థాయిలో లెక్కలు
- 10 మందిలోపు విద్యార్థులున్న1,231 స్కూళ్ల మూత?
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే హేతుబద్ధీకరించాల్సిన పాఠశాలలు, ఉపాధ్యాయుల లెక్కలను విద్యాశాఖ సేకరించింది. ఏయే జిల్లాల్లో ఎన్ని స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం (మూసివేత) చేయాలి,  ఎంత మంది టీచర్లను విద్యార్థులున్న స్కూళ్లకు పంపాలి అనే అంశాలపై అవగాహనకు వచ్చింది. వాటిని ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని యోచిస్తోంది.

ఈ మేరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి లెక్కలు సరి చూస్తున్నారు. అలాగే ఇతర పాఠశాలల్లో పరిస్థితులపైనా సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు వేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 3,998 ఉండగా 10 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 1,231 ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మూసివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మంగళవారంలోగా హేతుబద్ధీకరణ లెక్కలు తేల్చాలని అధికారులను విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల్లో డీఈవోలు చేపట్టిన పనులన్నీ పూర్తి కావచ్చాయి. ప్రభుత్వం ఆమోదించగానే హేతుబద్ధీకరణను అమలు చేయనున్నారు.

 మూసేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పినా...
 రాష్ట్రంలో పాఠశాలలను మూసివేయబోమని విద్యాశాఖ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కానీ ప్రస్తుతం 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయమై దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో విద్యార్థి మాత్రమే ఉన్న స్కూళ్లు 13 ఉండగా, ఇద్దరేసి విద్యార్థులు ఉన్న స్కూళ్లు 50, ముగ్గురు చొప్పున విద్యార్థులు ఉన్న పాఠశాలలు 66, ఐదుగురు చొప్పున విద్యార్థులు ఉన్న స్కూళ్లు 135, మిగతా పాఠశాలల్లో ఐదుగురు నుంచి 10 మందిలోపు విద్యార్థులు ఉన్నట్లు తేల్చింది. అయితే ఆ పాఠశాలలను కొనసాగించడం కష్టమైనప్పటికీ వాటన్నింటినీ ఇతర పాఠశాలల్లో విలీనం చేయడం సరికాదకాదన్న భావనను కొంత మంది ఉన్నతాధికారులే వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కష్టమని, వాగులు, కొండ ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని, అక్కడ పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయడం ద్వారా అక్కడి విద్యార్థులకు విద్యావకాశాలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయన్న అంశంపై పరిశీలన జరుపుతున్నారు. మరోవైపు 405 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేకపోగా, ఈసారి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో దాదాపు 275 పాఠశాలల్లో విద్యార్థులు చేరారు. అయితే అందులోనూ 10 మందిలోపే విద్యార్థులు చేరిన పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు మిగితా పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను వీలైనన్ని విలీనం చేయాలన్న ఆలోచనలు చేస్తోంది. అవసరమైతే వాటిల్లోని విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపించేందుకు రవాణా సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ప్రభుత్వంతో చర్చించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement