గ్రామాల్లో స్థానిక అవసరాలకు ఉచిత అనుమతి
జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి.
ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
గతంలోనూ వెసులుబాటు..
తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది.
ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment