
బస్..తుస్!
సిటీ బస్సులు ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.
మూణ్ణాళ్ల ముచ్చటగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు
వెయ్యికి పైగా డొక్కువే మెట్రో సర్వీసులు
ప్రధాన రూట్లకే పరిమితం శివారు ప్రాంతాలకు అరకొరగానే...
ఇదీ నగరంలో ఆర్టీసీ తీరు
సిటీబ్యూరో: సిటీ బస్సులు ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. నడిరోడ్డుపై అర్ధాంతరంగా నిలిచే డొక్కు బస్సుల కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు సకాలంలో గమ్యం చేరుకోలేక పోతున్నారు. ఆర్టీసీపై నమ్మకం కోల్పోయిన ప్రజలు సొంత వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాదిలో సుమారు 3.36 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి రావడం ప్రజా రవాణా డొల్లతనానికి నిదర్శనం. గ్రేటర్ పరిధిలోని 28 డిపోలలో 3,850 బస్సులు ఉంటే... వాటిలో సుమారు 1000 బస్సులు డొక్కువే. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 2008-2010 మధ్య కాలంలో వచ్చిన వందలాది బస్సులు ఐదారేళ్లకే బ్రేక్‌డౌన్ స్థితికి చేరుకున్నాయి. సుమారు రూ.160 కోట్ల నష్టాలతో నడుస్తున్న గ్రేటర్ ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయలేక... డొక్కువి నడపలేక ప్రయాణికులకు దూరమవుతోంది. గత అయిదేళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 72 నుంచి 68 శాతానికి పడిపోవడమే దీనికి ప్రబల నిదర్శనం.
15 వేల కిలోమీటర్ల మేర రద్దు
ఒకవైపు రూ.కోట్లు ఖరీదు చేసే ఓల్వో వంటి అధునాతన బస్సులను సమకూర్చుకుంటున్న గ్రేటర్ ఆర్టీసీ... ఉన్న బస్సుల నిర్వహణలో విఫలమవుతోంది. ప్రస్తుతం 3,850 సిటీ బస్సులు ఉండగా... అందులో 2,500 మాత్రమే ఆర్డినరీవి. మిగతావి ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కొనుగోలు చేసిన వాటిలో 500కు పైగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, మరో 500 ఆర్డినరీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. సాధారణంగా ఒక బస్సు 15 సంవత్సరాల పాటు లేదా 11.5 లక్షల కిలోమీటర్ల వరకు సేవలందిస్తుంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల జీవిత కాలం ఏడెనిమిదేళ్లకే ముగుస్తోంది. నిత్యం 20 నుంచి 25 బస్సులు ఎక్కడో ఒకచోట ఆగిపోతున్నాయి. దానికితోడు మెట్రో పనులు, ట్రాఫిక్ రద్దీ వంటి కారణాల వల్ల రోజూ వేలాది ట్రిప్పులు రద్దవుతున్నాయి. ఇలా 12వేల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు రద్దవుతున్నట్లు అంచనా. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు విడిభాగాల కొరత కూడా బ్రేక్‌డౌన్‌లకు ఆజ్యం పోస్తోంది. సకాలంలో నట్లు, బోల్టులు, బ్రష్‌లు, కమాన్‌పట్టాలు, ఇతర టెక్నికల్ స్పేర్‌పార్ట్స్ అమర్చకపోవడం వల్ల బస్సులు మొండికేస్తున్నాయి. సికింద్రాబాద్, బేగంపేట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠి, అబిడ్స్, పంజగుట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో బస్సులు బ్రేక్‌డౌన్ కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది.
శివార్లలో తప్పని పడిగాపులు
ఎల్‌బీ నగర్ నుంచి లింగంపల్లికి, దిల్‌సుఖ్‌నగర్ నుంచి పటాన్‌చెరుకు, కోఠి నుంచి బీహెచ్‌ఈఎల్‌కు ప్రతి 5- 10 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతాయి. కానీ ఎల్‌బీనగర్‌కు కూతవేటు దూరంలో ఉన్న మన్సూరాబాద్‌కు సిటీ బస్సు ఎప్పుడొస్తుందో... ఎప్పుడు వెళ్తుందో తెలియదు. జీడిమెట్ల-జగద్గిరిగుట్ట మధ్య బస్సుల జాడ కనిపించదు. బ్రేక్‌డౌన్‌లతో సిటీ బస్సులు ప్రధాన రూట్లకే పరిమితమవుతున్నాయి. నగర శివార్లకు, కొత్తగా ఏర్పడే కాలనీలకు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. చీకటి పడితే చాలు... బస్సుపై ఆశలు వదులుకోవలసి వస్తోంది. అనేక కాలనీలకు రాత్రి 9 దాటితే బస్సులు వెళ్లడం లేదు.
ఎల్‌బీనగర్ కేంద్రంగా ఉన్న కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్‌నగర్, మన్సూరాబాద్, కర్మన్‌ఘాట్, చిన్నరావిరాల, పెద్దరావిరాల, బండరావిరాల, గౌరెల్లి, బాచారం తదితర ప్రాంతాలకు బస్సులు చాలా తక్కువ.జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని వందలాది కాలనీలు ఉన్నాయి. కానీ అనేక ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం రెండు, మూడు ట్రిప్పులకే బస్సులు పరిమితం.బాలానగర్‌లోని సాయినగర్, జీడిమెట్ల- జగద్గిరిగుట్ట, మచ్చబొల్లారం ప్రాంతాలకు సిటీబస్సు గగనమే.
నేరేడ్‌మెట్, మల్కాజిగిరి ప్రాంతాలను ఆనుకొని ఉన్న 150 కాలనీలకు ఇప్పటికీ అరకొర బస్సులే.కాప్రా పరిధిలోని అంబేద్కర్ నగర్, సాయిబాబా నగర్, వంపుగూడ తదితర ప్రాంతాల్లోని వందలాది కాలనీల ప్రజలకు నిత్యం పడిగాపులు తప్పడం లేదు. పర్వాతాపూర్‌లోని సత్యనారాయణపురం, శ్రీనివాసపురం, లక్ష్మీనగర్, మల్లికార్జున నగర్. సాయిప్రియ నగర్ తదితర కాలనీల కు రాత్రి 9 దాటితే బస్సులు బంద్.శేరిలింగంపల్లి పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ, మయూరి నగర్, బీకే ఎన్‌క్లేవ్, గోకుల్ ఫ్లాట్స్ వంటి ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం తక్కువే.