వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు | City buses On Roads When the Medical Department Approves | Sakshi
Sakshi News home page

వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

Sep 7 2020 5:01 AM | Updated on Sep 7 2020 5:45 AM

City buses On Roads When the Medical Department Approves - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడంతో సిటీ బస్‌లు తిప్పేందుకు వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎస్‌ ఆర్టీసీ సంప్రదించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం సిటీ సర్వీసులు నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులు మొదలు కానున్నాయి. మిగిలిన బస్‌ సర్వీసులు కూడా 50 శాతం వరకు తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, గత నెలలో రోజుకు 8 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పిన ఆర్టీసీ.. గత వారం నుంచి రోజుకు 12 లక్షల కిలోమీటర్ల వరకు నడుపుతోంది. ఇక సర్వీసుల్ని 2,200 నుంచి 2,746కు పెంచింది. 

హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు
► అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. 
► రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ఇవి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు.
► మరోవైపు హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు గానూ అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్‌ ఇంకా స్పందించలేదు. 
► సర్వీసుల పెంపునకు టీఎస్‌ ఆర్టీసీ ససేమిరా అంటోంది. అలాగే ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్‌ ఆర్టీసీ తెగేసి చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement