కరోనా లాక్‌డౌన్లు ముగిశాయి. దాదాపు అన్నిటికీ కేంద్ర సర్కార్ లాకులెత్తింది. నిబంధనలకు లోబడి ప్రజా రవాణా చేసుకోచ్చని తెలిపింది. ప్యాసెంజర్ రైళ్లు మినహా, ప్రత్యేక, మెట్రో రైలు సేవలు అందుబాటులోకొచ్చాయి. అన్ని రాష్ట్రాల మధ్య బస్సులు తిరుగుతున్నాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునురద్ధరణ ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినప్పటకీ ఎటుంటి పురోగతి లేదు. బస్సు సర్వీసులు మీరే ఎక్కువ నడపాలి, అంటే మీరే తక్కువ నడపాలి అనే రెండు రాష్ట్రాల పంచాయితీ నడుమ ప్రైవేటు బస్సులు లబ్ది పొందుతున్నాయి. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నేడు మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల ఈడీల సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనలు ఇలా...
ఆంధ్రప్రదేశ్ వాదన
తమ రాష్ట్రంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపే విషయంలో తెలంగాణ ఆర్టీసీ మొండికేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధమైన టీఎస్‌ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందానికి మాత్రం ససేమిరా అంటోంది. లాక్‌డౌన్‌కు ముందు కర్ణాటక, మహారాష్ట్రకు తిప్పుతున్న బస్సుల్ని కిలోమీటర్ల ప్రకారం నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కిలోమీటర్లు ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై తమ భూభాగంలో ఏపీఎస్ ఆర్టీసీ లక్షా10 వేల కిలోమీటర్ల మేర తగ్గించుకోవాలని తెలంగాణ పట్టుబడుతోంది. తాము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని, టీఎస్‌ఆర్టీసీని 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని సూచిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా స్పందించడంలేదు. మిగిలిన రూట్లలో బస్సుల్ని పెంచకుండా హైదరాబాద్–విజయవాడ రూట్‌లో పెంచుతామనడం సరికాదు. టీఎస్‌ఆర్టీసీ తీరు వల్ల ప్రైవేటు బస్సులు పెరిగాయి. ఆపరేటర్లు ఒకే పర్మిట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం భారీ ఆదాయం కోల్పోతుంది. గతంలో ప్రైవేటు బస్సుల వల్ల రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతున్నామన్న టీఎస్‌ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు పెరిగినా.. తెలంగాణ ఆదాయం కోల్పోతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థకావడం లేదు.
(చదవండి: అద్దె మాఫీ!)
తెలంగాణ వాదన
రూట్లవారీగా రెండు రాష్ర్టాలు సమాన కిలోమీటర్లు బస్సులు నడపాలని తెలంగాణ ప్రతిపాదించింది. రూట్లవారీగా కొన్ని ప్రతిపాదనలను ఏపీ అధికారులకు ఇచ్చింది. వాటిపై అధ్యయనం చేశాక ఎగ్జిక్యూటివ్ అధికారుల స్థాయిలో మరోసారి భేటీ అవుతాం. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడున్న దానికంటే 50 శాతం మేర కిలోమీటర్లు పెంచుకుంటే.. తాము 52 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఒప్పందం జరిగేవరకు 70 వేల కిలోమీటర్ల మేర రెండు రాష్ర్టాలు నడుపుదామని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. ఒప్పందం పూర్తయితేనే బాగుంటుందని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. రెండు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
(చదవండి: కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!)
అయితే, దసరా పండుగ సమీపిస్తుండటంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థల మధ్య ఈ దఫా జరుగుతున్న చర్చలు ఫలప్రదమవుతాయని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment