భీమవరం (ప్రకాశంచౌక్): సంక్రాంతికి నగరం మొత్తం పల్లెబాట పట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే జనాల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన పండగ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి జిల్లాల్లోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం డిపోలకు నడుస్తాయి. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదారాబాద్ నుంచి జిల్లాకు ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సులు దాదాపు కిక్కిరిసి ఉంటున్నాయి.
105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు
హైదారాబాద్ నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు పండుగకు వచ్చే ప్రయాణికులను తీసుకురావడానికి ఆర్టీసీ 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతోంది. గతేడాది మాదిరిగానే సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.750, ఇంద్ర రూ.950, అల్ట్రా రూ.710 చొప్పున వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ కూడా 90 శాతం మేర పూర్తయ్యింది.
బస్సుల సంఖ్య పెంచుతాం
సంక్రాంతి పండుగకు ముందు, తర్వాత కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాం. పండగకు ముందు 105, పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి 84 ప్రత్యేక బస్సులు తిప్పుతాం. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్య పెంచుతాం. «టిక్కెట్ చార్జీ పెంచకుండా సాధారణ చార్జీలకే సర్వీసులు నడుపుతున్నాం. ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పండగకు ప్రజలు ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.
– ఏ.వీరయ్య చౌదరి, ప్రజా రవాణా అధికారి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment