సాక్షి, గుంటూరు : రాజధాని నగరమైన గుంటూరులో భోపాల్, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల తరహాలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. గుంటూరు నగరంలో కాలం చెల్లిన సిటీ బస్సులు నడుస్తుండటంతో కాలుష్యం అధికంగా ఉంటుంది. అంతేకాక, సిటీ బస్సుల్లో ప్రయాణం నరకప్రాయంగా ఉంటుందని ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు సిటీ బస్సులతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు.
గుంటూరును సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించిన నగరపాలక సంస్థ అధికారులు సిటీ బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలకు అప్పగించి పర్యవేక్షించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నగరంలో అర్బన్ మాస్టర్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ సర్వే నిర్వహిస్తోంది. టెండర్ల ద్వారా నేషనల్ లెవల్ బిడ్డింగ్ నిర్వహించి సిటీ బస్సుల నిర్వహణ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలకు అప్పగించనున్నట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు.
ఏపీఎస్ ఆర్టీసీకి షేర్ ఇచ్చే యోచన...
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు నడపాలంటే ఏపీఎస్‌ఆర్టీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ ద్వారా నగరంలో సిటీ బస్సులు నడపా లనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. మామూలు బస్సులు కాకుండా రాజధాని నగరంలో అందుకు తగ్గ లగ్జరీ బస్సులు నడిపి సిటీ లుక్కు తేవాలని కమిషనర్ కన్నబాబు భావిస్తున్నారు.
ఈ తరహా బస్సులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు నగరపాలక సంస్థకు ఆదాయం భారీగా రాగలదని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంగీకరించని పక్షంలో సంయుక్తంగా నిర్వహించేలా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సిటీ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ, జీఎంసీలు షేర్ చేసుకొనేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే నిర్వహణ బాధ్యతలు పూర్తిగా తామే చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు నగరపాలకసంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు.
సిటీ లుక్ తేవడంతోపాటు ఆదాయం సమకూరుస్తాం..
నగరానికి రాజధాని సిటీ లుక్ తేవడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చేందుకు సిటీ బస్సులను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీతో షేరింగ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాం. నిర్వహణ బాధ్యతలను మాత్రం నగరపాలక సంస్థ చూసుకుంటుంది.
- కె.కన్నబాబు, జీఎంసీ కమిషనర్
కార్యరూపం దాల్చని
ఆర్టీసీ ప్రతిపాదన
పట్నంబజారు (గుంటూరు) : గుంటూరు నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో సిటీ బస్సులు తిప్పాలనే ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. ఈ విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు రాగానే నగరంలో సిటీ సర్వీసుగా తిప్పుతామని చెప్పిన ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇటీవల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు 50 వచ్చినా వాటిని గుంటూరు సిటీకి కేటాయించకుండా రీజియన్ పరిధిలో తిప్పుతున్నారు.
పుష్కరాల అనంతరం సిటీ సర్వీసులు
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు సిటీలో తిప్పాలని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం వచ్చిన బస్సులు రీజియన్ పరిధిలో ట్రయల్ రన్‌లో భాగంగా నడుస్తున్నాయి. బస్సులన్నీ కేవలం సిటీ సర్వీసుల కోసం వచ్చినవి కావు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన ప్రాంతాల్లో తిప్పుతాం. గోదావరి పుష్కరాల అనంతరం సిటీ సర్వీసులు నగరంలో కచ్చితంగా తిరుగుతాయి.
- జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్‌ఎం.
లగ్జరీలో..దర్జాగా..!
Published Thu, Jul 2 2015 1:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement