మళ్లీ బడికి
గుంటూరు ఎడ్యుకేషన్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం ప్రారంభం కానున్నాయి. సెలవులను సరదాగా ఎంజాయ్ చేసి, నూతన విద్యాసంవత్సరం పాఠశాలల్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ఉద్ధరించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టించుకోవడం లేదు.
కాలంచెల్లిన శిథిల భవనాల స్థానంలో నూతన తరగతి గదుల నిర్మాణం, ఫర్నీచర్, సురక్షిత తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కలగానే మిగిలిపోనున్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఏటా విడుదలవుతున్న కోట్లాది రూపాయల నిధులు అధికారుల చిత్తశుద్ధి లేమి, ప్రణాళిక లోపంతో సద్వినియోగానికి నోచుకోవడం లేదు.
విద్యాసంవత్సరంలో మొదట్లో ప్రారంభిస్తున్న తరగతి గదుల నిర్మాణ పనులు మరుసటి విద్యాసంవత్సరానికి సైతం పూర్తికావడం లేదు. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 23 లక్షల పాఠ్య పుస్తకాలు ముందుగానే జిల్లాకు చేరుకున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న 2.75 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించిన ఉచిత యూనిఫాం పంపిణీ గతి తప్పింది. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ యూనిఫాంలు పాఠశాలలకు చేరుకోలేదని తెలిసింది.
ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
వేసవి సెలవులను ఎంజాయ్ చేసి భవితపై కోటి ఆశలతో మళ్లీ పాఠశాలల్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. డీఎస్సీ-2012 ద్వారా జిల్లాలో 404 పోస్టులు భర్తీ అయిన తరువాత మళ్లీ ఇప్పటి వరకూ ఉపాధ్యాయుల నియామకాల ఊసే లేదు.
రెండేళ్లుగా ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన పోస్టులు భారీగా పేరుకుపోయాయి. 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు సైతం లేరు. అదే విధంగా ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం-50 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-300, ప్రాథమిక విద్యాబోధనలో కీలమైన ఎస్జీటీ పోస్టులు-577 సహా భాషా పండిత, పీడీ, పీఈటీ పోస్టులు-62 భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి. పాఠాలు బోధించే ఉపాధ్యాయులతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణాధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 57 మండలాలకు గానూ 50 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు లేరు. అదే విధంగా ఐదు డివిజన్లలో ఒక్క గుంటూరు డివిజన్ మినహా ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఇన్‌చార్జ్ అధికారులతో కొనసాగుతున్నాయి. జెడ్పీ పాఠశాలల పర్యవేక్షణకు ఉద్దేశించిన జెడ్పీ ఎడ్యుకేషన్ అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉండటం గమనార్హం.
ఒకటో తరగతికి 50 వేల మంది..
జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల వయసు నిండిన 50 వేల మందికి పైగా చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పించాల్సి ఉంది. గురువారం నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న దృష్ట్యా బడి ఈడు చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు ఉద్దేశించిన బడి బాటపై ఇప్పటి వరకూ ప్రభుత్వం విధాన పరమైన కార్యక్రమాన్ని ప్రకటించకపోవడంతో చిన్నారుల చేరికపై ఇటు అధికారులు, అటు ఉపాధ్యాయులకూ స్పష్టత లోపించింది.
వీరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టని పక్షంలో వారందరూ ప్రవేటు స్కూళ్లకు తరలిపోయే ప్రమాదముంది. ఫలితంగా ఇప్పటికే దీనావస్థలో కాలం వెళ్ళదీస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మరింత అగాథంలోకి వెళ్లనున్నాయి.