కడప అర్బన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో మే నెలాఖరులోపు కడపకు 40 సిటీ బస్సులు వస్తాయని కడప రీజినల్ మేనేజర్ గోపినాథరెడ్డి తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. సిటీ బస్సులన్నీ కడప డిపో-2 పర్యవేక్షణలో నడుస్తాయన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) సౌజన్యంతో ఈ బస్సులు రానున్నాయన్నారు. సెమి ఫ్లోర్‌తో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా 20 నుంచి 30 లక్షల ఖర్చుతో ఒక్కో బస్సు ఆధునిక పరిజ్ఞానం ఐటీ, జీపీఎస్ ద్వారా స్టేజీ పేర్లు డిస్ ప్లే అవుతాయన్నారు.
బస్సులో ప్రయాణించేవారికి రాబోయే స్టేజీ పేరు డి స్ ప్లే కావడం వల్ల అప్రమత్తంగా ఉంటారన్నారు. కడపలో సిటీ బస్సులు విజయవంతమైతే ప్రొద్దుటూరులో కూడా నడుపుతారని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. రూటుమ్యాప్‌ను త్వరలోనే రూపొందిస్తామన్నారు.
సౌకర్యాల కల్పనకు దాతల ముందడుగు
ఆర్టీసీ బస్టాండ్లలో మంచినీటి సౌకర్యంగానీ, ఇతర సౌకార్యల ఏర్పాటుకు దాతలు ముందుకు వస్తున్నారని ఆర్‌ఏం తెలిపారు. రాయచోటిలో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారని, దీని కోసం లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. ప్రొద్దుటూరులో అద్దె బస్సుల అసోసియేషన్ ఆర్వో ప్లాంటును ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అలాగే కడపలో ఐఓసీ వారు ఆర్వో ప్లాంటును ప్రయాణీకుల సౌకర్యార్థం బస్టాండులో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
నష్టాలను తగ్గించే ప్రయత్నం
కడప రీజియన్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆర్‌ఎం తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 68 కోట్లు నష్టం వచ్చిందన్నారు. 2014-15 సంవత్సరానికి ఆ నష్టం రూ. 65 కోట్లకు చేరుకుందన్నారు. 2015-16 సంవత్సరానికి రూ. 62 కోట్లు లేక అంతకంటే తక్కువ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రద్దీ అధికంగా ఉన్న బస్సు సర్వీసుల రూట్లలో పల్లె వెలుగు స్థానాల్లో ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో కడప- పులివెందుల, కడప-ప్రొద్దుటూరు, కడప-రాజంపేటలకు బస్సు సర్వీసులను పెంచుతామన్నారు. అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తగ్గించామన్నారు. తద్వారా నష్టాన్ని తగ్గించగలుగుతున్నామన్నారు.
నెలలోగా కడపకు సిటీ బస్సులు
Published Thu, Apr 30 2015 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement