సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్లే | KCR Holds Review Meeting With Officials On RTC Services | Sakshi
Sakshi News home page

సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్లే

Published Wed, Jun 10 2020 1:36 AM | Last Updated on Wed, Jun 10 2020 8:36 AM

KCR Holds Review Meeting With Officials On RTC Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సులతోపాటు ఎయిర్‌పోర్టు సర్వీసులను ఇప్పట్లో పునరుద్ధరించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సులతో ఇప్పటికే నష్టాలు వచ్చాయని, ప్రస్తుత పరిస్థితిలో సిటీ బస్సులు నడిపి ఇంకా నష్టాలు పెంచుకోరాదని నిశ్చయించింది. అలాగే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సర్వీ సుల రాకపోకలను అనుమతిం చాలని నిర్ణయించింది. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై సుదీర్ఘంగా సమీక్షించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు పాల్గొన్నారు.

బస్సుల సంఖ్య లెక్కనే ఒప్పందాలు
ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం ఆధారంగానే ఇప్పటివరకు మహా రాష్ట్ర, కర్ణాటకకు అంతర్రాష్ట బస్సు సేవలు నడిచాయి. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సేవలను పునరుద్ధరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ఆయా రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్లు తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీ (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, వోల్వో)గా ఎన్ని బస్సులు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అదే కేటగిరీలకు సంబంధించిన తెలంగాణ బస్సులు సైతం అదే సంఖ్యలో అన్ని కిలోమీటర్ల మేరకు ఆయా రాష్ట్రాల్లో తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధానంగా లాభాలొచ్చే రూట్లలో ఏపీఎస్‌ఆర్టీసీ అధిక సంఖ్యలో బస్సులు నడిపి నష్టాలు వచ్చే రూట్లలో తక్కువగా నడుపుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోందని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల బస్సులు ఒక రూట్లో ఎన్ని కిలోమీటర్లు నడిపితే రాష్ట్ర బస్సులు సైతం అన్ని కిలోమీటర్లు నడిపేలా పకడ్బందీగా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో రాష్ట్ర సీఎస్‌ సమావేశమై ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

జిల్లాల్లో ఆర్టీసీకి నష్టాలెందుకు?
కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేశాక జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించినా నష్టాలు ఎందుకు వస్తున్నాయని సీఎం అధికారులను ప్రశ్నించారు. అయితే కరోనా వైరస్‌ భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కట్లేదని, దీంతో సగం సీట్లు ఖాళీగా పెట్టి బస్సులు నడపాల్సి వస్తోందని అధికారులు సీఎంకు నివేదించారు. రాష్ట్రంలో సరుకు రవాణా కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 85 కార్గో బస్సు సర్వీసులను ప్రారంభించినా ప్రైవేటు ఆర్డర్లను సాధించడంలో రవాణా శాఖ అధికారులు విఫలమయ్యారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఆర్డర్లు తెచ్చుకుంటున్నా ఆర్టీసీ అధికారులు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement