సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాలబాట పడుతున్న ఆర్టీసీకి.. కరోనా కష్టాలు తెచ్చిపెట్టిందని, అయినా సంస్థను బతికించుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సిబ్బంది 2 నెలల (50 శాతం) జీతాన్ని తక్షణమే చెల్లించాలని నిర్ణయిం చారు. దీని కోసం తక్షణమే రూ.120 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులను పెంచితే, జిల్లాల నుంచి వచ్చి పోయే ప్రయాణికులకు రవాణా భరోసా దొరుకుతుందని, దీని కోసం సిటీ సర్వీసులను 50% పెంచాలని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు.
కేంద్రం ప్రైవేటీకరణ..
‘రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తోంది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రతనిస్తోంది. విద్యుత్ శాఖలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను (ఆర్టిజన్లుగా) క్రమబద్ధీకరించాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ సహా ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేట్‌పరం చేసుకుంటూ వస్తోంది. ఆర్టీసీని తిరిగి గాడిన పెట్టేదాక నిద్రపోను. నేన్నుంత కాలం సంస్థను బతికించుకుంట. పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకైన రవాణా వ్యవస్థ. ప్రభుత్వం లాభనష్టాల గురించి ఆలోచించకుండా ఆర్టీసీని కాపాడుకోవాలని అనుకుంటోంది.
సంస్థకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా భయంతో వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగి ఆర్టీసీ ఆక్యూపెన్సీ రేషియో తగ్గిపోయి సంస్థ నష్టాల బాటపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. సంస్థ పూర్వ స్థితికి రావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అధికారులు విశ్లేషించుకోవాలని కేసీఆర్ అన్నారు. ‘కరోనా పరిస్థితుల నుంచి ఒక్కొక్క వ్యవస్థ గాడినపడుతోంది. హోటళ్లు, దాబాలు తదితర ప్రజావసర రంగాలు కోలుకుంటున్నయ్. జన సంచారం క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసీని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాలో లోతుగా చర్చించండి’అని సీఎం సూచించారు.
కార్గో సేవలకు ఆదరణ..
ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్‌లో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్స్ ట్రాన్స్‌పోర్టు చేసిన రికార్డును ఆర్టీసీ సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను, అధికారులను అభినందించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసీకి అదనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ, అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment