CM KCR: Order Set-Up 132 Study Circles 4-Per 33 District SC-ST-BC-Minority - Sakshi
Sakshi News home page

‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ స్టడీ సర్కిల్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’ ఏర్పాటుకు కేసీఆర్‌ ఆదేశాలు

Published Wed, Jul 6 2022 2:15 AM | Last Updated on Wed, Jul 6 2022 9:04 AM

CM KCR Order Set-up 132 Study circles 4-Per 33 District SC-ST-BC-Minority - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్‌–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ స్టడీ సర్కిల్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కోరారు.

నాలుగు వర్గాలకు నాలుగు ఆల్‌ ఇండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై  సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.  

అందుబాటులో జాతీయ స్థాయి నోటిఫికేషన్లు 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్‌ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు.  

అద్భుతమైన భూమికను పోషించాలి 
‘స్టడీ సర్కిళ్లు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్‌మెంట్‌ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్‌ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలి.

ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్‌ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్‌ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్‌లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. విద్యార్థులకు కల్పించినట్టుగానే విద్యార్థినులకు కూడా ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు.   

అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియెట్‌ 
పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఇంటర్మీడియెట్‌ విద్యను, కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే  ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియెట్‌ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఎంతమంది? పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని కోరారు.  

గురుకులాల్లో ఆధునిక కోర్సులు 
రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే ఆధునిక డిగ్రీ కోర్సులను రూపొందించాలని  సూచించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement