మరిన్ని పట్టణాలకు సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కొత్త బస్సులు రానున్నాయి. యూపీఏ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు ఎన్డీయే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. లక్ష నుంచి మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాలను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో చేరుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ పథకం కింద కరీంనగర్ 70, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లకు 30 చొప్పున కొత్త బస్సులను మంజూరు చేసింది. ఈ మేరకు సిటీ బస్సులు కొనేందుకు వీలుగా నిధులు మంజూరు చేసింది.
దాదాపు ఆరు నెలల క్రితమే సూత్రప్రాయ అంగీకారం రావటంతో.. నిధులెలాగూ వస్తాయన్న ఉద్దేశంతో టీఎస్ ఆర్టీసీ ముందుగానే కొన్ని బస్సులు కొనుగోలు చేసి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలకు కేటాయించింది.
ఆరు పట్టణాలకు వెసులుబాటు...
ఈ ఆర్థిక సంవత్సరంతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం ముగిసి ‘అమృత్’ పథకం పూర్తిస్థాయిలో పట్టాలెక్కబోతున్నందున నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ లాంటి కొత్త పట్టణాలకు ప్రతిపాదనలు త్వరగా పంపాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు త్వరలో సర్వే చేయనున్నట్టు తెలిసింది.
ఆ బస్సులు మాకొద్దు...
గతంలో ఈ పథకం కింద హైదరాబాద్‌కు కేంద్రం మంజూరు చేసిన బస్సుల బాడీ సరిగా లేకపోవటంతో తరచూ మరమ్మతులు చేయిస్తేగాని అవి నడవని దుస్థితి ఉండటం విశేషం. దీంతో ఈసారి ఆ బస్సులొద్దని, నిధులిస్తే అనుకూలంగా ఉండే బస్సులు సమకూర్చుకుంటామంటూ రాష్ట్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం సమ్మతించింది.