నగరాల రూపురేఖలు మారిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాతో కిలోమీటర్ల కొలదీ విస్తరిస్తున్నాయి. దీంతో ప్రజల రవాణా అవసరాలు సైతం పెరుగుతున్నాయి.
సాక్షి, రాజమండ్రి :నగరాల రూపురేఖలు మారిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాతో కిలోమీటర్ల కొలదీ విస్తరిస్తున్నాయి. దీంతో ప్రజల రవాణా అవసరాలు సైతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రధాన నగరాలైన రాజమండ్రి, కాకినాడల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆటోలు వందల నుంచి వేల సంఖ్యలో పెరిగిపోయాయి. నేడు ఈ రెండు నగరాల్లో కుటుంబం అంతా కలసి ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటో ఎక్కక తప్పని స్థితి నెలకొంది. కనీసం రూ. 50 నుంచి రూ. 100 ఖర్చుచేయక పోతే కుదరని దుస్థితి. ఈ తరుణంలో త్వరలో ఈ రెండు నగరాల రోడ్లపై సిటీబస్సులు పరుగులు పెడతాయని వచ్చిన వార్తలు ప్రజలకు కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. ఏడాది క్రితం వచ్చిన ఈ అవకాశాన్ని మన రాజకీయ పెద్దలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యారని తెలిసి నిరాశకు వారు గురవుతున్నారు.
బస్సుల ప్రతిపాదన ఇలా
పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు, అభివృద్ధికి ఉద్దేశించిన జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) నగరాల్లో సిటీబస్సులు నిర్వహించేందుకు గుర్తింపు పొందిన సంస్థలకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సంస్థ నేరుగా బస్సులను కోనుగోలు చేసి అందిస్తుంది. ఇందులో భాగంగా 2013 మే నెలలో రాష్ట్రానికి సుమారు వెయ్యి బస్సులు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్టీసీ కూడా ఈ బస్సులను 17 నగరాల్లో సిటీబస్సులుగా తిప్పేందుకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు ప్రతిపాదనలు పంపింది. మొత్తం రూ. 273 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహాయం పోను ఆర్టీసీ వాటాగా రూ. 28 కోట్లు భరించేందుకు అంచనాలు రూపొందించారు. ఇందులో రాజమండ్రి, కాకినాడల్లో 35 బస్సులు వంతున సిటీ సర్వీసులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. కేంద్ర సహాయంలో భాగంగా గత అక్టోబర్‌లో 400 బస్సులను కేటాయించారు. వీటిలో 75 బస్సులను తక్షణం అందజేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రయత్న లోపంతో అవి విశాఖ, విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు కేటాయించేశారు.
కారణాలు ఇవిగో
ప్రజలకు సిటీ సర్వీసుల అవసరం దండిగా ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. ఆర్టీసీ అధికారులు కూడా సిటీ సర్వీసుల నిర్వహణపై అనాసక్తత వ్యక్తం చేశారని తెలిసింది. బస్సుల ద్వారా కొత్తగా డ్రైవర్, కండక్టరు పోస్టులు వస్తున్నప్పటికీ ఉన్న బస్సులకు తోడు కొత్తవి వస్తే పనిభారం పెరిగిపోతుందని భావించారో ఏమో తమ శాఖపై స్థానిక అధికారులు కూడా పెద్దగా వత్తిడి తేలేదని తెలుస్తోంది. ప్రధానంగా సిటీ సర్వీసుల పరుగులు ఆటోలకు చెక్ పెడతాయన్న భయంతో ప్రైవేట్ ఆపరేటర్లను రక్షించుకునేందుకు బస్సులు రాకుండా కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ స్థాయిలో మోకాలడ్డారని విమర్శలు వినవస్తున్నాయి.
పుష్కరాలకైనా ఫలించేనా?
రాజమండ్రిలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రోజూ లక్షలాది మంది వచ్చి గోదావరి స్నానాలు చేస్తారు. ఈ లోగానైనా సిటీ సర్వీసులు రాజమండ్రిలో పరుగులు పెడితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.