ఏపీఎస్ ఆర్టీసీకే ‘సంక్రాంతి’
♦ హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు
♦ రద్దీని సొమ్ము చేసుకోవడానికి విజయవాడ సిటీ బస్సులు
♦ ఆదాయం పొందే అవకాశమున్నా.. చేతులెత్తేసిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ కూడలి ప్రాంతం.. సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.. విజయవాడలో తిరిగే సిటీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఎల్‌బీనగర్‌లో ఆగుతున్నాయి.. ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. వాటితోపాటు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన గరుడ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులూ పెద్ద సంఖ్యలో వచ్చి జనాన్ని తీసుకెళుతున్నాయి. ఇంతగా ప్రయాణికుల రద్దీ ఉన్నా తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులేవీ అక్కడ కనబడడం లేదు. భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటే బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఆర్టీసీకి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా భారీగా ఆదాయమూ దక్కే అవకాశం ఉంది. కానీ సంక్రాంతి రద్దీ వేళ పరిస్థితి ఇం దుకు పూర్తి విరుద్ధంగా కొనసాగుతోంది. ‘సంక్రాంతి’ ప్రయాణికులను చేరవేసి గంపగుత్తగా ఆదాయం పొందేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళికాబద్ధంగా దూసుకుపోతుండగా.. తెలంగాణ ఆర్టీసీ మాత్రం చోద్యం చూస్తోంది. అదేమంటే ఆంధ్రా ప్రాంతానికి తిప్పేందుకు పర్మిట్లు లేవని చెబుతోంది. ఆ పర్మిట్లలో మూడొంతులకుపైగా ఏపీఎస్ ఆర్టీసీ చేతిలో ఉన్నా... ఇంతకాలం నోరుమెదపకుండా.. ఇప్పుడు నిస్సహాయత వ్యక్తం చేస్తుండడంపై టీఎస్‌ఆర్టీసీ సిబ్బందే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
3 వేలకుపైగా ప్రత్యేక బస్సులు..
హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 20 లక్షల మంది వరకూ వెళ్తారు. ఇందుకోసం ఏటా ప్రత్యేక బస్సులు వేస్తారు. రద్దీబాగా పెరిగితే హైదరాబాద్ సిటీ బస్సులకు ‘స్పెషల్’ బోర్డులు తగిలించి నడిపారు కూడా. కానీ ఈసారి ఆ ‘స్పెషల్’ బస్సులుగా విజయవాడ సిటీ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దింపింది. అవి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ వరకు వస్తే టీఎస్ ఆర్టీసీ సిబ్బంది అడ్డుకునే అవకాశం ఉంటుందని భావించిన ఏపీ అధికారులు వాటిని ఎల్‌బీనగర్ వరకే పరిమితం చేశారు. మొత్తంగా ఏపీఎస్ ఆర్టీసీ మూడువేలకు పైగా ప్రత్యేక బస్సులను రంగంలోకి దింపింది.
మరోవైపు ఈ సీజన్‌లో కనీసం రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండి కూడా తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాప్రాంతానికి అదనపు బస్సులను తిప్పడం లేదు. సంక్రాంతి కోసం రెండు వేలకుపైగా ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్టు ఇటీవల ప్రకటించినా... వాటిని కేవలం తెలంగాణ జిల్లాలకే పరిమితం చేసింది.