ఆర్టీసీలో బదిలీలాట!
* వారం క్రితం జరిగిన బదిలీల్లో మార్పులు
* 70 మందికి తిరిగి కొత్త పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో బదిలీలాట సాగుతోంది. ఎక్కడి వారు అక్కడ పద్ధతిలో పాలనపరంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు కావటంతోనే తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 270 మంది అధికారులను బదిలీ చేశారు. ఒకే పోస్టులో మూడేళ్లుపైబడ్డవారిని మార్చారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు, వరస పదోన్నతులు పొందుతూ ఒకేచోట పాతుకుపోయినవారిని కూడా మార్చారు.
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలబాట పట్టాలంటే అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఎం సూచించటంతో... ఈ మార్పులు అవసరమని ఆర్టీసీ జేఎండీ రమణరావు భావించారు. దీంతో సమూలంగా ప్రక్షాళన లక్ష్యంగా ఆయన భారీ ఎత్తున బదిలీలు చేశారు. దీంతో చాలామంది అభ్యర్థనలు పెట్టుకున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు... ఇలా పరిశీలనార్హమైన అభ్యర్థనలు కొన్ని రావటంతో వాటి ఆధారంగా మార్పుచేర్పులు చేయాలని జేఎండీ నిర్ణయించారు. వాటిని పరిశీలించి సిఫారసు చేసేందుకు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో ఆయన ఓ కమిటీ ఏర్పాటు చేశారు.
కొందరు అవినీతి అధికారులు కూడా కోరుకున్న సీటు కోసం పైరవీలు ప్రారంభించారు. ఇందుకోసం అర్థబలం, రాజకీయ నేతల బలాన్ని కూడా ఉపయోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేశారు. వెరసి... బదిలీ అయిన వారిలో 70 మందికి తిరిగి కొత్త పోస్టింగ్స్ జారీ చేశారు. ఇందులో అర్హమైన మార్పులు కొన్ని ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం ఒత్తిళ్లతో చేసినవి ఉన్నాయని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. ఇక పదోన్నతి కల్పించి జూనియర్లకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారంటూ సీనియర్లు చేసిన ఫిర్యాదుల మేరకు కొన్ని మార్పులు చేశా రు. ఈ నేపథ్యంలో మార్పులకు సంబంధించి 70 మంది అధికారులకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. వారంతా గురువారం కొత్త చోట రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.