మన పిల్లలు గ్లోబల్‌ స్టూడెంట్స్‌ | Edutech education for 8th class students in AP govt schools | Sakshi
Sakshi News home page

మన పిల్లలు గ్లోబల్‌ స్టూడెంట్స్‌

Published Thu, Sep 8 2022 4:15 AM | Last Updated on Thu, Sep 8 2022 6:54 AM

Edutech education for 8th class students in AP govt schools - Sakshi

సాక్షి, అమరావతి: విద్యా పరంగా ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలనే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం, చిత్తశుద్ధి, ఆశయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే పిల్లలు సీబీఎస్‌ఈ బోర్డు (పదో తరగతి) పరీక్షలు సమర్థవంతంగా రాసేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతోంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించేంబదుకు అవసరమైన చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే 4.72 లక్షల మంది పిల్లలకు రూ.606.18 కోట్ల వ్యయంతో, 8వ తరగతి పాఠాలు చెప్పే 50,194 మంది టీచర్లకు రూ.64.46 కోట్లతో ప్రముఖ కంపెనీ శ్యామ్‌సంగ్‌ ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా అతి పెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఉచితంగా కంటెంట్‌ను ఇవ్వనుంది.

రివర్స్‌ టెండరింగ్‌తో మార్కెట్‌ ధర కంటే తక్కువ 
► జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ 15 తర్వాత 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్యామ్‌సంగ్‌ ట్యాబ్‌లను అత్యంత పారదర్శకంగా, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా బయట మార్కెట్‌ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది.  
► మెమొరీ కార్డుతో సహా మూడేళ్ల వారంటీ వంటి ఫీచర్స్‌ అన్నీ కలిపితే బయట మార్కెట్‌లో శ్యామ్‌సంగ్‌ ఒక్కో ట్యాబ్‌ ఖరీదు రూ.16,446 చొప్పున.. 5.22 లక్షల ట్యాబ్‌లకు రూ.858.48 కోట్ల వ్యయం అవుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో ఒక్కో ట్యాబ్‌ను రూ.12,843 చొప్పున 5.22 లక్షల ట్యాబ్‌లను రూ.670.64 కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన రూ.187.84 కోట్లు ఆదా చేసింది. 
► 5.22 లక్షల మంది 8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.1,923.20 కోట్ల విలువైన బైజూస్‌ కంటెంట్‌ను, శ్యామ్‌సంగ్‌ ట్యాబ్‌లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి, టీచర్‌కు రూ.24 వేల విలువైన బైజూస్‌ కంటెంట్, రూ.12,843 ట్యాబ్‌ కలిపి మొత్తం రూ.36,843 విలువైన మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తోంది.

ట్యాబ్‌ల ప్రత్యేకతలు ఇవీ..
► ట్యాబ్‌లు, బ్యాటరీకి మూడేళ్ల వారంటీ (సాధారణంగా ఏడాది మాత్రమే) ఉంటుంది. 
► మొబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ఫ్లిప్‌ కవర్‌తో 8.7 అంగుళాలు ఉంటుంది. 
► పిల్లలు చూడకూడని సైట్‌లు బ్లాక్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో లోడ్‌ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు అవాంఛనీయ సైట్ల జోలికి వెళ్లే అవకాశం ఏ కోశానా ఉండదు.  
► కంటెంట్‌ డేటా కార్డుతో పాటు 64 జీబీ మెమొరీ కార్డు. 
► ఏటా పదవ తరగతి వరకు విద్యార్థులకు ఇదే ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి ఇస్తారు. 
► ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్, బైజూస్‌ కంటెంట్‌ ఇస్తారు. 
► ఏదైనా రిపేరు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారంలోగా సరిచేసి లేదా రీప్లేస్‌ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్‌ చేయనున్నారు. 
► విజువల్‌ గ్రాఫిక్స్‌తో కూడిన కంటెంట్‌ను ట్యాబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పిల్లలు సులభంగా అర్థం చేసుకోనున్నారు. 

బైజూస్‌తో ఒప్పందంలో ముఖ్యాంశాలు
►  ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బైజూస్‌తో ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్‌ యాప్‌ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. 
► 2025 నాటికి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాసేందుకు వీలుగా వారిని సన్నద్ధం చేసేందుకు ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ యాప్‌ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది.   
► బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌లో బోధన అత్యంత నాణ్యతగా ఉంటుంది. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫ్స్‌ ద్వారా విద్యార్థులు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.  
► మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ఈ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్, అటు తెలుగు మాధ్యమంలోనూ అందుబాటులో ఉంటాయి. తద్వారా భాషా పరమైన ఆటంకాలు లేకుండా పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది.  
► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టత, నాణ్యతతో ఉంటాయి.  
► విద్యార్థులు ఎంత వరకు నేర్చకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్‌ బ్యాక్‌ పంపుతారు.   
► సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా మ్యాపింగ్‌ చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి అధ్యాయంలోనూ వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది.  
► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్‌ గేమ్స్‌ కూడా యాప్‌లో ఉంటాయి. 
► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, అనుకరణ.. అన్నీ యాప్‌లో పొందుపరిచారు.  
► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్‌ స్కాన్‌ క్వశ్చన్స్‌ (లైవ్‌ చాట్‌ పద్ధతిలో నేరుగా), స్టెప్‌ బై స్టెప్‌ సొల్యూషన్స్‌ ఈ యాప్‌ ద్వారా లభిస్తాయి.  
► తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులోకి వస్తాయి.  
► విద్యార్థి నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుడితో మీటింగ్‌ కూడా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement