నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
Published Tue, Feb 28 2017 10:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
► బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న
► బొప్పారంలో బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
కేతేపల్లి (నకిరేకల్): పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కేతేపల్లి మండల పరిధిలోని బొప్పారం శివారులో మూసీ ప్రాజెక్టు వద్ద రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సోమవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. పేదవారికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారన్నారు. ఆయా పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో రూ.380 కోట్లు కేటాయించిందని తెలిపారు. బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్న గత పాలకులు వారికి విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో విస్మరించారని అన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉచితంగా రూ.20 లక్షల అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
విద్యాభివృద్ధికి పెద్దపీట : మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పీజీ వరకు మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆంధ్ర పాలకుల హయాంలో జిల్లాలో 26 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అదనంగా 44 పాఠశాలలు మంజూరు చేసిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నకిరేకల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.2000కోట్లు మంజూరు చేసిందన్నారు. విద్యార్థులు కేవలం సర్టిఫికెట్ల కోసమే చదవడం కాకుండా భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించి తమను కన్నవారి కలలను సాకారం చేయాలని సూచించారు.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు దిగువన ఉన్న 90 ఎకరాల స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కాసనగోడు, గుడివాడ గ్రామాల మధ్య విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయాలన్నారు. అంతకు ముందు పాఠశాల భవన నిర్మాణ నమూనాను మంత్రులు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శోభాదేవి, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, కేతేపల్లి ఎంపీపీ గుత్తా మంజుల, వివిధ గ్రామాల సర్పంచ్‌లు కె.లింగయ్య, కె.వెంకటరమణ, బి.సైదమ్మ, కె.లక్ష్మి, ఎంపీటీసీ కె.మోహన్, టీఆర్‌ఎస్ నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, పూజర్ల శంభయ్య, కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, గుత్తా మాధవరెడ్డి, బి.దయాకర్‌రెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, కత్తుల వీరయ్య పి.ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement