![Foreign Investment In Hyderabad For Quality Education - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/14/Education.jpg.webp?itok=p4doSMZC)
సాక్షి, హైదరాబాద్: ఐటీ, బీపీవో, కేపీవో రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన హైదరాబాద్ నగరానికి, విద్యారంగంలోనూ విదేశీ పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విఖ్యాత విద్యాసంస్థలు నగర విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. హైదరాబాద్‌లో పిల్లలను అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం, లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు వెనుకాడకపోవటం, నాణ్యమైన విద్యను బోధించే టీచర్లు ఉండడం, తీరైన మౌలిక వసతులు, జీవన ప్రమాణాలకు నగరం నిలయంగా మారటంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది నగర విద్యారంగంలోకి సుమారు రూ.2 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా సంస్థ ‘సెరేస్ట్రా ’తాజా అధ్యయనంలో తేలింది.
రూ. 200 నుంచి 500 కోట్ల పెట్టుబడులు
అమెరికా, యూకే దేశాల్లో అమల్లో ఉన్న విద్యా విధానాలను నగర విద్యార్థులకు చేరువ చేసేందుకు పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ కరిక్యులంతో పాటు.. అత్యాధునిక విద్యావిధానాన్ని పరిచయం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఓక్రిడ్జ్, చిరెక్, యూరోకిడ్స్ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
వీటికి తోడు తాజాగా ఫిన్‌లాండ్‌కు చెందిన కాగ్నిటా, హాంకాంగ్ చెందిన నార్డ్ ఏంజిలా వంటి విద్యా సంస్థలు నగరంలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ సంస్థలతో పాటు నూతనంగా వస్తున్న సంస్థలు రూ.200 – 500 కోట్ల పెట్టుబడులను ఈ ఏడాది నగర విద్యా రంగంలో పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.
పెట్టుబడుల వెల్లువకు కారణాలివే..
►కార్పొరేట్ విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం.
►లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు వెనుకాడకపోవడం. అంతర్జాతీయ ప్రమాణాలను తమ చిన్నారులు అందిపుచ్చుకుంటారన్న నమ్మకం.
►కార్పొరేట్ విద్యా సంస్థల ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు నగరంలో పలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం.
Comments
Please login to add a commentAdd a comment